దిశ దశ, కరీంనగర్:
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కరీంనగర్ ఉమ్మడి జిల్లాను సెంటిమెంట్ గా భావిస్తున్నట్టు ఉన్నాయి. తమ తొలి సభలను కరీంనగర్ ఉమ్మడి జిల్లా వేదికగా ఏర్పాటు చేస్తుండడం విశేషం. దీంతో అన్ని రాజకీయ పార్టీలకు కరీంనగర్ సెంటిమెంట్ కలిసొస్తుందా అన్న చర్చ సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు ఈ జిల్లా నుండి ప్రచారం ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం. ఆదివారం15న హుస్నాబాద్ లో ప్రజా ఆశీర్వద సభతో 2023 ఎన్నికల శంఖారావాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూరించనున్నారు. ఈ వేదిక మీదుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజా సంక్షేమం కోసం కొత్తగా ఏం చేయబోతున్నారో ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎలాంటి విజన్ తో ముందుకు సాగనుందో కూడా వివరించనున్నారు. గతంలో జరిగిన రెండు ఎన్నికల ప్రచారం కూడా హుస్నాబాద్ నుండి ప్రారంభించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాయితీగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. సోమవారం
16న జిల్లాలోని జమ్మికుంటకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రానున్నారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే పనిలో బీజేపీ నాయకులు నిమగ్నమయ్యారు. హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపించాలని రాజ్ నాథ్ సింగ్ అభ్యర్థించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. బుధవారం 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జైత్రయాత్ర ను జగిత్యాల నుంచి ప్రారంభిస్తున్నారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించించిన తర్వాత ళ ప్రచార రథాలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేనతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుండి బస్సు యాత్ర ప్రారంభం చేసి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తెలంగాణలో ప్రచారం చేసేందుకు రాహుల్ చేపట్టనున్న బస్సు యాత్ర జగిత్యాల నుండి ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలాంటి వైఖరితో ముందుకు సాగుతామో రాహుల్ గాంధీ వివరించనున్నారు.