కారు అందుకున్న చేయి… చేయిని పట్టుకున్న సింహం

దిశ దశ, భూపాలపల్లి:

ఈ సారి కోల్ బెల్ట్ లో వైవిద్యమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారే ఇప్పుడు కూడా బరిలో ఉన్నప్పటికీ ఇరువురు అభ్యర్థులు కూడా పార్టీలు మారి బరిలో నిలుస్తున్నారు.

భూపాలపల్లి పాలిటిక్స్

జిల్లా కేంద్రమైన భూపాలపల్లిలో ఈ సారి రసవత్తరపోరు జరిగేలా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన గండ్ర సత్యనారాయణ రావు ఈ సారి ప్రధాన పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తుండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సారి బీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో నిలుస్తున్నారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గండ్ర సత్యనారాయణ రావు ముచ్చటగా మూడో సారి ఇక్కడి నుండి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ తొలి స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన మధుసూధనాచారి 65,111 ఓట్లు సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి 57,899 ఓట్ల సాధించుకోగా, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యానారయణ రావు 57,530 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన గండ్ర వెంకట రమణారెడ్డి 69,918 ఓట్లు సాధించి గెలవగా, రెండో స్థానంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గండ్ర సత్యానారాయణ రావు 54, 283 ఓట్లు సాధించుకున్నారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మధు సూధనా చారి 53,567 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఈ సారి మాత్రం ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గుర్తులు మారిపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి ఈ సారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించనుండగా, సింహం గుర్తుపై నిలబడ్డ గండ్ర సత్యనారాయణ చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరనున్నారు. గత రెండు ఎన్నికల్లో బరిలో నిలిచిన మధుసూధనాచారిని సీఎం కేసీఆర్ శాంతింపజేయడంతో ఆయన ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.

ముచ్చటగా మూడో పార్టీ…

భూపాలపల్లి ప్రజల చేతిలో తన భవితవ్యాన్ని ఉంచిన గండ్ర సత్యనారాయణ రావు ప్రతి ఎన్నికప్పుడు పార్టీ మారుతూ బరిలో నిలుస్తున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీ చేసిన ఆయన 2018 ఎన్నికల్లో ఏఐఎఫ్బీ సింహం గుర్తుపై పోటీ చేశారు. ఈ సారి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై నిలబడ్డ గండ్ర సత్యానారాయణ రావు ప్రజా క్షేత్రంలో తన సత్తా ఏంటో పరీక్షించుకోనున్నారు. ఈ సారి ఆయన ప్రత్యర్థిగా ఉన్న గండ్ర వెంకట రమణారెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ తరుపున బరిలో నిలుస్తుండడం గమనార్హం.

ఇంటిపేరుతో కన్ఫ్యూజ్…

ఇకపోతే ఇక్కడ బరిలో నిలుస్తున్న రాజకీయ వైరుద్యం ఉన్న ఇద్దరు అభ్యర్థుల ఇంటి పేర్లు కూడా ఒకేటే కావడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట రమణారెడ్డి ఇంటిపేరు, కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ రావు ఇంటి పేరు ‘గండ్ర’నే కావడంతో వారి అనుచరులు కొంతమేర కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీంతో జీవీఆర్ అని వెంకట రమణారెడ్డిని, జీఎస్సార్ అని సత్యనారాయణ రావును పిలుచుకునే సంప్రాదాయం మొదలైంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లకు మాత్రం ఇద్దరి ఇంటి పేరు ఒకటే కావడం వల్ల ఇబ్బంది తప్పడం లేదు. ఏది ఏమైనా భూపాలపల్లి ముఖచిత్రాన పార్టీలు మారుతూ చట్టసభలోకి అడుగు పెట్టేందుకు అభ్యర్థులు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు.

You cannot copy content of this page