దిశ దశ, హైదరాబాద్:
ఓ వైపున కుండపోతగా కురుస్తున్న వర్షం… వరద నీటి ప్రవాహంతో వాగులు వంకలను మరిపిస్తున్న రహదారులు… అర్థరాత్రి వేళ అయినా అక్కడ పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తూనే ఉన్నారు… ట్రాఫిక్ విధుల్లో నిమగ్నమైన పోలీసులు ఒక్కసారిగా అలెర్ట్ అయి కార్యరంగంలోకి దిగారు… ఏ మాత్రం ఆలస్యం చేసినా ఓ కుటుంబమంతా కూడా వరద నీటిలో గల్లంతయ్యేది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన పోలీసుల అప్రమత్తత తీరుకు దర్పణం పడుతోంది.
వనస్థలిపురంలో…
శుక్రవారం అర్థరాత్రి సమయంలో వనస్థలిపురం పనామా చౌరస్తా మీదుగా వెల్తున్న ఓ కారు వరద నీటి కారణంగా అదుపు తప్పి ఓ నాలాలోకి దూసుకుని వెల్లింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు, కానిస్టుబుళ్లు సైదులు, శ్రీనివాసరావులు అక్కడకు చేరుకుని ముందుగా కారులో చిక్కుకున్న కుటుంబ సభ్యులను కాపాడారు. హయత్ నగర్ కు చెందిన వినోద్ తన భార్య, పిల్లలతో కారులో వెల్తుండగా ఈ ఘటన జరిగింది. వరద తగ్గముఖం పట్టిన తరువాత నాలాలో చిక్కుకున్న కారును కూడా క్రేన్ సాయంతో బయటకు తీయించారు పోలీసులు. పనామా చౌరస్తా వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసు బృందం ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కుటుంబం నాలా వరద నీటిలో గల్లంతయ్యేది. రాత్రి 11 గంటల తరువాత కూడా పోలీసులు భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని డ్యూటీల్లో ఉండడం వల్లే వినోద్ కుటుంబం ప్రాణాపాయం నుండి బయటపడగలిగింది.