అన్న వస్తాడు రిటర్న్ గిఫ్టులు ఇస్తాడు..

జైళ్లో ఉండి వాళ్లూ నడిపించారు..

‘నందెల్లి’ అభిమానుల కామెంట్స్ వైరల్

దిశ దశ, కరీంనగర్:

అన్న వస్తాడు ఎవరికి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ లు వారికి ఇచ్చేస్తాడు.. ఎవరూ అధైర్య పడవద్దు సహనంతో ఉండండి… మహా మహానాయకులే జైలులో ఉండి తన కార్యకలాపాలను చేశారు. మన తెలుగు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడిపారు. దానిని బూతద్దంలో చూడాల్సిన పని లేదు మళ్లీ బయటకు వస్తాడు.. 14 రోజుల రిమాండ్ తరువాత మళ్లీ బయటకు వస్తాడు కదా అంటూ సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన పోస్టులు కరీంనగర్ లో వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనచరుడిగా గుర్తింపు పొందిన నందెల్లి మహిపాల్ గత మంగళవారం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ భూ దందా కేసులో నందెల్లి మహిపాల్ అరెస్ట్ కావడంతో ఆయన అనుచరుల్లో నైరాశ్యం నెలకొన్నట్టుగా ఉంది. మహిపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుండి జైలుకు తరలించే వరకూ కూడా అనుచరులు పెద్ద ఎత్తున ఆయన వాహనం వెంటే తిరిగారు. అన్నను పోలీసులు పట్టుకెళ్లడం ఏంటన్న ఆవేదన వారిలో కనిపించింది. ఆయనకు కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో అుచరుల్లో మానసిక్ స్థైర్యం కోల్పోయినట్టుగా అనిపిస్తోంది. ఈ కారణంగానే ఈ పోస్టు షేర్ చేసినట్టుగా ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు. అయితే మహిపాల్ బయటకు వచ్చిన తరువాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తారంటూ చేసిన వ్యాఖ్య దేనికి సంకేతమన్న విషయంపై చర్చ సాగుతోంది. మహిపాల్ పై క్రిమినల్ కేసు పెట్టిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా..? లేక పోలీసులకు ఇస్తారా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. అయితే ఆయన అభిమానులు అత్యుత్సాహంగా ఆ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ చేసినప్పటికీ మరో కేసులో కూడా మహిపాల్ పై పి.టి. వారెంట్ వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ లో నమోదయిన ఈ కేసులో మరోసారి ఆయన్ను అరెస్ట్ చేయడంతో పాటు కస్టడి పిటిషన్ వేసి విచారించే అవకాశాలు ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో అభిమానులు ఆశించినట్టుగా 14 రోజుల్లో మాత్రం ఆయన బయటకు వచ్చే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. మరో వైపున మహిపాల్ అరెస్టును రేవంత్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులతో పోల్చడంపై కూడా తర్జనభర్జనలు సాగుతున్నాయి.

You cannot copy content of this page