అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తీరుపై మేథావుల్లో చర్చ
దిశ దశ, కరీంనగర్:
ఉత్తర తెలంగాణాలో ప్రైవేటు విద్యా సంస్థల పేరు చెప్పగానే ప్రముఖంగా వినిపించే పేరు అల్ఫోర్స్… తెలంగాణ, మహారాష్ట్రల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన క్రెడిట్ కొట్టేసింది ఈ విద్యా సంస్థ. మొదట సైకిల్ పై ఇంటింటికి తిరిగి ట్యూషన్లు చెప్తూ… విద్యారంగంలోకి అడుగుపెట్టానని ప్రకటించిన వి నరేందర్ రెడ్డి తెలంగాణ విద్యారంగంపై చెరగని ముద్ర వేశారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పని చేసిన ఆయన పేరు గత కొంత కాలంగా ప్రతి ఎన్నికలప్పుడు తెరపైకి రావడం… మరుగున పడడం కామన్ అన్నట్టుగా మారింది. విద్యారంగంపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి వస్తారన్నది ప్రచారం మాత్రమేనని ఆయన అటువైపు కన్నెత్తి చూడరని అనుకున్నారంతా. కానీ తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టం చేసిన నరేందర్ రెడ్డికి పాలిటిక్స్ పై ఉన్న శ్రద్ద ఏంటో స్పష్టం అయింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీ చేసి తీరుతానని ప్రకటించిన ఆయన ఈ సారి ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు.
నిబంధనలు పాటించారా..?
నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలబడడం ఖాయం అయిన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాలు కూడా వి నరేందర్ రెడ్డి మెరిట్స్, డి మెరిట్స్ పై చర్చిస్తున్నాయి. విద్యారంగంలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తున్నారు. దీంతో మేధావి వర్గాల్లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. చట్టసభలకు ప్రాతినిథ్యం వహించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతున్న నరేందర్ రెడ్డి నిబంధనలకు అనుగుణంగా ఎంత వరకు వ్యవహరించారు..? విద్యార్థులను తీర్చిదిద్దే విషయంలో ప్రామాణికతలు పాటించామని చెప్పుకుంటున్న అల్ఫోర్స్ విద్యా సంస్థలు నిబంధనల మేరకే కొనసాగుతున్నాయా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రధానంగా విద్యా సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత విభాగం నుండి అనుమతులు తీసుకున్న పేర్లు కాకుండా అదనపు పేర్లను జోడించి ప్రచారం చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. హైస్కూల్ వరకు అయితే డీఈఓ కార్యాలయాల నుండి అనుమతులు ఇస్తారు. ఇందులో కేవలం సంస్థపేరు పాఠశాల అని మాత్రమే ఉంటుంది… కానీ అల్ఫోర్స్ విద్యా సంస్థలు మాత్ర జెన్ నెక్స్ట్, ఐఏఎస్ అకాడమి వంటి పేర్లను జోడించి ప్రచారం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విధానం విద్యాశాఖ నిబంధనలకు విరుద్దమే అయినప్పటికీ అల్ఫోర్స్ బ్రాండ్ కారణంగా ఎవరూ కూడా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపున ఇంటర్ విద్యార్థులకు కూడా కాలేజీ నిర్వహణకు అనుమతులు తీసుకుంటారు కాని లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోచింగ్ లు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకునే సంప్రాదాయం లేదని తెలుస్తోంది. బోర్డు కూడా ఇందుకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వదని కేవలం తల్లిదండ్రులను ఆకర్షించేందుకు కోచింగ్ ల పేరిట కూడా అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
సమన్యాయం పాటిస్తున్నారా..?
సాధారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అసమానత్వాన్ని ప్రదర్శిస్తే పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ ఫీజులు చెల్లించి తమ పిల్లలను చదివిస్తున్నప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటున్నారోనన్న విషయాలు మాత్రం బయటకు పొక్కవు. వాస్తవంగా ప్రైవేటు కాలేజీలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించడానికి కారణం వారు మరింత మెరుగ్గా రాణించాలన్న భావనతోనే. కానీ చాలా ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా ప్రతిభ కనబర్చే వారి పట్ల ప్రత్యేక శ్రద్ద మిగతా వారి పట్ల కొంతమేర నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్న అభిప్రాయాలు బాహాటంగానే వినిపిస్తుంటాయి. ఈ విధానం అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోనూ కొనసాగుతున్నట్టుగా విద్యార్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. మెరిట్ స్టూడెంట్లకు ప్రత్యేకంగా గ్రూపులు ఏర్పాటు చేసి మిగతావారి ప్రతిభ ఆధారంగా గ్రూపులుగా విభజించే విధానాన్ని కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇలాంటి విధానం వల్ల చదువులో వెనకబడిన పిల్లలు మానసికంగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ తమ ప్రాధాన్యత మాత్రం మెరిట్ సాధించిన స్టూడెంట్లకే అన్న రీతిలో వ్యవహరించడం ఎంత వరకు సమంజసమో అన్న చర్చ సాగుతోంది. ఫీజుల విషయంలో కఠినంగా వ్యవహరించే అల్ఫోర్స్ విద్యా సంస్థల్లో విద్యార్థుల మెరిట్ ఆధారంగా బోధన చేస్తున్న తీరు మాత్రం సరైంది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారే ఎక్కువ. ఇంటర్మీడియెట్ అనేది విద్యార్ధి భవిష్యత్తును నిర్ణయించే వయసుకు చేరుకున్న తరువాత పూర్తి చేసేది. ఈ సమయంలో విద్యార్థుల్లో అసమానత్వం అనేది కనిపించకుండా వారి వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పెంచాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలపై ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల పట్ల సమన్యాయం పాటించకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినట్టయితే ఓటర్ల విషయంలో సమన్యాయం పాటిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ఉన్న నిబంధనలు పాటించే విషయంలోనే తప్పటడుగులు వేస్తున్న నేపథ్యంలో చట్టసభలకు ఎన్నికైన తరువాత ఎలా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.