దిశ దశ, జగిత్యాల:
తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా ఉంది. ఓ వైపున ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతూనే మరో వైపున సుముఖత వ్యక్తం చేయని వారి అనుచరులను లక్ష్యం చేసుకుని ముందుకు సాగుతున్నట్టుగా ఉంది. తాజాగా కోరుట్ల నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలను గమనిస్తే ఇదే విషయం స్ఫష్టం అవుతోంది. కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముందుకు వచ్చే అవకాశాలు లేవు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా ఉన్న డాక్టర్ సంజయ్ గులాభి జెండాను వదిలే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటోంది. బలమైన నాయకులుగా ఉన్న వారిని తమ పార్టీలోకి చేర్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నట్టుగా ఉంది. కోరుట్ల ఇంచార్జి జువ్వాడి నర్సింగ రావు, ఆయన సోదరుడు కృష్ణారావులు తమ ప్రత్యర్థిని రాజకీయంగా బలహీనుడిని చేసే విధంగా పావులు కదుపుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్య అనుచరులకు కాంగ్రెస్ కండువా కప్పేందుకు వ్యూహ రచన చేసిన నర్సింగరావు సక్సెస్ అయ్యారు. స్థానిక మునిసిపల్ ఛైర్ పర్సన్ దంపతులతో పాటు ఆరుగురు ముఖ్య అనుచరులను కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో సఫలం అయ్యారు జువ్వాడి బ్రదర్స్. పార్టీ తెలంగాణ ఇంచార్జీ దీప్ దాస్ మున్షి సమక్షంలో ఛైర్ పర్సన్ అన్నం లావణ్య, టౌన్ అధ్యక్షుడు అన్నం అనిల్, ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాటం పద్మ, సజ్జు భాయ్, గంధం గంగాధర్, బద్ది సుజాత, మురళి, జిందం లక్ష్మీనారాయణ, ఫర్ హత్ బేగం, అబ్దుల్ రమీమ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోరుట్ల పట్టణంలో పట్టున్న గులాభి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి కొంతమేర నష్టమేనని చెప్పక తప్పదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ తండ్రి విద్యాసాగర్ రావుకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విశ్వసనీయులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఆ పార్టీకి లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు.