చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆటంకాలు…

నాడు అలా… నేడు ఇలా…

భూములకు నీరందేదెలా..?

దిశ దశ, భూపాలపల్లి:

మంథని నియోజకవర్గంలో దిగువ మండలాల భూములను సస్యశామలం చేసే పథకానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. 18 ఏళ్ల క్రితం నిర్మాణానికి శ్రీకారం చుట్టినా నేటికీ పనులు మాత్రం పూర్తి కాకపోవడం ఆందోళన కల్గిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతమైన మహదేవపూర్, పలిమెల, కాటారం, మహాముత్తారం, మల్హర్ రావు మండలాలకు సాగు నీరందించేందుకు ప్రతిపాదించిన ఈ పధకం నత్తలకే నడక నేర్పుతోంది. తాజాగా నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టగా రైతుల అభ్యంతరాలతో అవాంతరాలు ఎదురవుతున్నాయి.

అప్పుడు అలా…

ఉమ్మడి రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి కాగా, అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పాటు ప్రభుత్వం మారిన తరువాత ముందుకు సాగలేదు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రధాన దృష్టి సారించడంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మరుగునపడిపోయినట్టయింది. హరీష్ రావు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు చిన్న కాళేశ్వరం పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని పరివాహక ప్రాంత భూములకు సాగు నీరందించేదుకు చొరవ తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు కెటాయించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ లో ప్రత్యేకంగా రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులకు సంబంధించిన అంచనాలను, ప్రతిపాదిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు పనులు జరుగుతున్న నేపథ్యంలో రైతాంగం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మహదేవపూర్ మండలం ఎలికేశ్వరం, రాపెల్లికోట గ్రామాలకు చెందిన రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

బీఆర్ఎస్ నేతల ఎంట్రీ…

ఎలికేశ్వరం గ్రామానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన విషయం వెలుగులోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులకు అండగా నిలబడేందుకు రంగంలోకి దిగారు. మండలిలో బీఆర్ఎస్ నేత మధు సూధనా చారి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులు అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామాల రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పరిహారం చెల్లించిన తరువాత పనులు చేపడితే బావుంటుందని వ్యాఖ్యానించారు. గెలిచిన ఏడాదిలోగానే పనులు పూర్తి చేస్తామని ఎన్నికల అప్పుడు హామీ ఇచ్చిన శ్రీధర్ బాబు ఇంతవరకూ చిన్న కాళేశ్వరం పనులు చేపట్టలేదని పుట్ట మధు ఆరోపించారు. తాము డిమాండ్ చేసిన తరువాతే ఈ పనుల కోసం నిధులు కెటాయించారని, బాధిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

పరిహారం ఇవ్వలేదా..?

అయితే తాజాగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాలువలను తవ్వాలని నిర్ణయించిన అధికారులు సర్వే జరపకుండా, భూ సేకరణ చేయకుండానే పనులు చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు అధికారవర్గాలు చెప్తున్న విషయాలు ఇవి. మొదట చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ జరిపామని అప్పుడే పట్టదారులకు డబ్బులు కూడా చెల్లించామని అంటున్నారు. ఇప్పుడు కాలువల నిర్మాణం జరిపేందుకు మిషనరీ వెల్తే రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. పట్టాదారులైన రైతులు కొంతమంది తాజా పరిస్థితులకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపున ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటున్న రైతులకు పరిహారం చెల్లించలేదని వారు రికార్డుల్లో లేకపోవడమే ఇందుకు కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. కానీ తాము ఇదే భూమిపై ఆధారపడి జీవిస్తున్నందున ఉపాధి కోల్పోతున్నందున తమకు న్యాయం చేయాలని రైతులు అంటున్నారు. అయితే అప్పుడు పరిహారం అందుకున్న రైతుల వివరాలను అధికారులు వెల్లడించినట్టయితే ఈ సమస్య ఎదురయ్యేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 2007-08లో కాలువల కోసం భూ సేకరణ  జరిపినప్పుడు తక్కువ వెడల్పు నిర్మాణం కోసం అంచనా వేసిన అధికారులు… తాజాగా అంతకు రెట్టింపు వెడల్పుతో కాలువల నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నారని రైతులు వాపోతున్నారు. దీనివల్ల తమకు ఇచ్చిన పరిహారం కంటే ఎక్కువ భూమిని కోల్పోతున్నామని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవేమయ్యాయ్..?

మరోవైపున ఎలికేశ్వరం గ్రామంలో చెరువులు, కుంటలు ఉండేవని వాటికి సంబంధించిన కాలువలు అస్తిత్వం లేకుండా పోయాయని కొందరు  స్థానికులు  అంటున్నారు. ఆ కాలువలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా శాఖల నుండి సేకరించినట్టయితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా చెరువులకు సంబంధించిన కాలువలకు చెందిన మ్యాపుల ఆధారంగా పూర్తి వివరాలు సేకరించి వాటిని పునరుద్దరించేందుకు చొరవ తీసుకుంటే ఆర్థిక భారం తగ్గడంతో పాటు నీటిని సరఫరా చేయడం కూడా సులువయ్యే అవకాశం ఉంటుంది. రాపెల్లికోటకు ఎగువ ప్రాంతంలోని కీకారణ్యంలో పెద్ద గుట్టల మధ్య చింతగండి చెరువు ఉంది. ఈ చెరువు నుండి కూడా పంటపొలాలకు నీరందించేందుకు ప్రత్యేకంగా కాలువలు ఉండేవి. ఆ కాలువలను గుర్తించి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page