వివరాలు సేకరించిన డీసీపీ సందీప్ రావు
దిశ దశ, హైదరాబాద్:
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి సారించినట్టుగా ఉంది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరుపునే ఈటలకు భద్రత కల్పిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, వివరాలను సేకరించాలని కూడా పోలీసులను ఆదేశించారు మంత్రి. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు ఈటల రాజేందర్ భద్రతకు సంబంధించిన విషయాల గురించి ఆరా తీస్తున్నారు. బుధవారం శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి డీసీపీ వెళ్లగా ఆయన హుజురాబాద్ పర్యటనలో ఉన్నారు. దీంతో రాజేందర్ తో డీసీపీ సందీప్ రావు ఫోన్లో మాట్లాడగా గురువారం వస్తానని చెప్పారు. దీంతో గురువారం కూడా మేడ్చల్ డీసీపీ సందీప్ రావు శామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లి భద్రతా ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఇంటి పరసరాలతో పాటు మర్డర్ స్కెచ్ వేసిన పూర్తి వివరాలను ఈటల రాజేందర్ ను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను కల్పించనుందని మీడియాలో కథనాలు రావడంతో మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించి రాజేందర్ సెక్యూరిటీ విషయంపై పరిశీలిస్తామన్నారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేయడంతో మేడ్చల్ పోలీసులు రాజేందర్ భద్రతపై క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నారు. సునిశితంగా వివరాలను సేకరిస్తున్న మేడ్చల్ డీసీపీ నివేదికను డీజీపీకి అందించిన తరువాత సెక్యూరిటీ అలాట్ చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ప్రాణాలే లక్ష్యంగా చేసుకున్నామన్న ఆడియోలు లీకయ్యాయన్న ఆరోపణలు రావడం గంటల వ్యవధిలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన రక్షణకు సంబంధించిన ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించడం గమనార్హం. అయితే ఇప్పటికే ఈటల రాజేందర్ కు సంబంధించిన సెక్యూరిటీ అంశంపై కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఇంటలీజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు కూడా శామీర్ పేట, హుజురాబాద్ ప్రాంతాల్లో పర్యటించి పూర్తి వివరాలు సేకరించి నివేదికలు పంపించారు. అటు రాష్ట్రం, ఇటు కేంద్రం ఈటల సెక్యూరిటీపై నివేదికలు తెప్పించుకోవడంతో సరికొత్త చర్చకు దారి తీసింది.