తూర్పు అడవులతో ముగిసిన అజ్ఞాత బంధం…

దిశ దశ, కాటారం:

ఐదు దశాబ్దాల విప్లవ చరిత్రతో అనుబంధం పెనవేసుకున్న ఆ బంధం ముగిసింది. అజ్ఞాత నక్సల్ కార్యకలాపాలు… ఎర్ర జెండా పాటల ఊసే లేకుండా పోయిన తూర్పు డివిజన్‌తో ఉన్న ఏకైక బంధం కూడా తెగిపోయింది. మావోయిస్టు పార్టీలో ముఖ్య నేతగా ఎదిగిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ ఎన్ కౌంటర్ లో మరణించడంతో విప్లవ బంధానికి తూర్పు అటవీ గ్రామాలకు ఉన్న ఏకైక అనబంధం కూడా ముగిసిపోయినట్టయింది.

జిల్లాలో ఐదుగురే…

దాదాపు పదిహేనేళ్ల క్రితం వరకు కూడా అన్నల ఉనికితోనే ఉన్న తూర్పు ప్రాంతంలో క్రమక్రమంగా ప్రభావం తగ్గిపోయింది. మావోయిస్టు పార్టీలో ముఖ్యనేతలుగా ఉన్న ప్రముఖులందరికి నియోజకవర్గం ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ అడవుల్లో అప్పుడు నక్సల్ కార్యకలాపాలు తీవ్రంగా ఉండేవి. గెరిల్లా యుద్దతంత్రం వైపు సాగుతున్న పీపుల్స్ వార్ ఉనికి క్రమ క్రమంగా తగ్గడం ఆరంభించింది. మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిన తరువాత అయితే సాయుధ నక్సల్ జాడ కూడా లేకుండా పోయింది. అప్పటికే అడవి బాటపట్టిన ఈ ప్రాంత వాసులు కూడా జనజీవనంలో కలవడమో లేక ఎన్ కౌంటర్లలో హతం కావడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్న ముఖ్య నేతలకు అడ్డాగా ఉన్న మహదేవపూర్ ప్రాంతంలో నేడు ఎర్ర జెండా కనిపించకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగా కూడా కేవలం ఐదుగురు మాత్రమే విప్లవ పంథా వైపు అడుగులు వేసి అజ్ఞాతంలో జీవితం గడుపుతున్నారు. వారిలో ఒకరు అన్నె సంతోష్ అలియాస్ సాగర్ కాగా ఆయన శనివారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించారు. దీంతో తూర్పు డివిజన్ పల్లెలతో అడవి బాట పట్టిన వారి శకం ముగిసినట్టయింది.

దస్తగిరిపల్లిలో విషాదం…

జిల్లాలోని కాటారం మండలం దస్తగిరిపల్లికి చెందిన అన్నె సంతోష్ తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహద్దు అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్ పార్టీలో చేరిన సంతోష్ పార్టీలో డిప్యూటీ కమాండర్ స్థాయి నుంచి తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, సీఆర్సీ సభ్యుడిగా ఎదిగాడు. పూర్వ బస్తర్ అటవీ ప్రాంతంలో ఉంటూ మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే శనివారం నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో సంతోష్ మరణించిన విషయం తెలియడంతో దస్తగిరిపల్లితో పాటు సమీప గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం కనిపెంచిన తల్లిదండ్రులను, కన్న ఊరిని వదిలి అడవి బాట పట్టిన సంతోష్ శవాన్ని చూసిన ఆయన బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చత్తీస్ గడ్ లోని ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పుల్లో మరణించిన సంతోష్ మృతదేహాన్ని బీజాపూర్ లో పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆదివారం సాయంత్రం దస్తగిరిపల్లికి చేరుకున్న సంతోష్ మృతదేహానికి నివాళులు అర్పించిన స్థానికులు, బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు అంతిమ యాత్ర నిర్వహించారు.

You cannot copy content of this page