బురదమయమైన కాలనీ
దిశ దశ, కరీంనగర్:
వానస్తే నగరమంతా వరద నీటితో నిండిపోతే ఆ కాలనీలో మాత్రం బురద నీటి మయం అయింది. అడుగు తీసి అడుగేయలేని పరిస్థితి కాలనీలో ఎదురయింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో బయటకు రాకుండా ఉన్న కాలనీ వాసులు మంగళవారం ఉదయం ఇండ్ల నుండి బయటకు కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. తెల్లవారే సరికి డ్రైనేజీ సిల్ట్ తో నిండిపోయిన కాలనీ రోడ్లను చూసి స్థానికులు షాకుకు గురయ్యారు.
అసలేం జరిగింది..?
కరీంనగర్ కట్ట రాంపూర్ ను ఆనుకుని ఏర్పడిన తిరుమల నగర్ కాలనీ నిన్న మొన్నటి వరకు గేటెడ్ కమ్యూనిటీని తలపించే విధంగా ఉండేది. తిరుమల నగర్ అభివృద్ది కోసం కాలనీ వాసులంతా కలిసి ఏకమై ముందుకు సాగే వారు. అయితే ఇటీవల బల్దియా అధికారులు తీసుకున్న ఓ నిర్ణయం వీరిని బలి చేసింది. కట్టరాంపూర్ మీదుగా వెల్లే డ్రైనేజీని స్టేడియం సమీపంలోని గణేష్ నగర్ మెయిన్ డ్రైన్ కు లింక్ ఇవ్వకుండా తిరుమల నగర్ మీదుగా డైవర్ట్ చేశారు. రామచంద్రాపూర్ కాలనీ, భగత్ నగర్ ల నుండి కూడా ఇదే డ్రైన్ కు లింక్ ఉండడంతో పాటు కట్టరాంపూర్, తిరుమల నగర్ మీదుగా వెల్తున్న ఈ డ్రైనేజీని హనుమాన్ మందిర్ వెనక నుండి నిర్మిస్తూ మెయిన్ డ్రైన్ కు లింక్ ఇవ్వాలన్న ప్రతిపాదనలు చేశారు. అయితే ఎందుకో తెలియదు కానీ ఆ ప్లాన్ రీ డిజైన్ చేయడంతో తిరుమల నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో ఆ కాలనీ వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావనే చెప్పాలి. సాధారణ రోజుల్లోనే మురుగునీటితో సహవాసం చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోమవారం కురిసిన వర్షంతో డ్రైనేజీలోని సిల్ట్ అంతా కాలనీలోని వీధుల్లో పరుచుకపోయింది. తారు రోడ్లను మరిపిస్తున్న విధంగా బురద పేరుకపోవడంతో కాలనీ వాసులు తమ ఇండ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ కెనాల్ ను తిరుమల నగర్ కాలనీ మీదుగా డైవర్ట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటో తెలియదు కానీ తాము మాత్రం ప్రత్యక్ష్య నరకం అనుభవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు తమ ఇంటి ఆవరణలోకి కూడా బురద నీరు వచ్చి చేరిందని కాలనీ వాసులు వివరించారు.
మంత్రిని కలిసి…
తమ కాలనీలో డ్రైనేజీ అసంపూర్తి నిర్మాణంతో వదిలేయడంతో నరకయాతన పడుతున్నామని స్థానికులు మంత్రి గంగుల కమలాకర్ ను కూడా కలిసి విన్నవించుకున్నారు. సోమవారం మద్యాహ్నమే మంత్రిని కలిసిన కాలనీ వాసులు డ్రైనేజీ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి తమ కష్టాల నుండి గట్టెంకించాలని, మురుగు నీటి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నామని కూడా ఆందోళన వ్యక్తం చేశారు.