కార్యరంగంలోకి రాజేశ్వర్ రావు సన్స్..!

హుజురాబాద్ పాలిటిక్స్

దిశ దశ, హుజురాబాద్:

మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు ఫ్యామిలీ మెంబర్స్ సమీకరణాలు చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఆయన మనవడు ప్రణవ్ బాబు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణవ్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండడంతో హుజురాబాద్ ప్రాంత వాసులతో టచ్ లోకి వెల్తున్నారు. ప్రణవ్ బాబును గెలిపించుకునేందుకు తమకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయం ఉన్నవారిని, సమాజంలో ప్రభావితం చేసే వారితో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. రాజేశ్వర్ రావు వారసత్వాన్ని రాజకీయాల్లో కొనసాగించాలన్న సంకల్పంతో ఆయన తనయులు ఉండడం, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు మనవడు ప్రణవ్ కూడా ముందుకు రావడంతో సమీకరణాలు నెరిపే పనిలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో వ్యక్తిగత పరిచయాలతో పాటు ఇమేజ్ కూడా పెంచుకున్న ప్రణవ్ బాబుకు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలోకి ప్రణవ్ ను పంపించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజేశ్వర్ రావు తనయులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. టికెట్ వచ్చే వరకూ వేచి చూసే ధోరణితో ఉండకుండా గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తే ఎన్నికల నాటికి తమ పని మరింత సులువు అవుతుందని భావించినట్టుగా తెలిసింది. దీంతో రాజేశ్వర్ రావు తనయులు తమ కుటుంబంతో అనుబంధం పెనవేసుకున్న వారితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ప్రణవ్ కు అనుకూల వాతావరణం ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. హుజురాబాద్ నుండి ప్రణవ్ ప్రాతినిథ్యం ఖచ్చితంగా ఉండాల్సిందేనన్న సంకల్పంతో ఉన్న వారంతా కూడా అండర్ గ్రౌండ్ వర్క్ స్పీడప్ చేసినట్టుగా తెలుస్తోంది. కమలాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట, వీణవంక, హుజురాబాద్ మండలాల్లోని తమ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న వారందరిని కూడా సమీకరించాలని యోచిస్తున్నట్టుగా సమాచారం. దీంతో పాటు పార్టీ ఓటు బ్యాంకు జారీ పోకుండా ఉండేందుకు తీసుకోవల్సిన చర్యలపై కూడా కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. తొలి ప్రయత్నంలోనే విజయవంతం కావాలన్న లక్ష్యంతో రాజేశ్వర్ రావు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా సీరియస్ గా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు.

You cannot copy content of this page