దిశ దశ, మంథని, చెన్నూరు, మహదేవపూర్:
ఎగువన గోదావరి ఉప్పొంగుతుందంటే చాలు అక్కడి రైతులు దిగాలు పడిపోతున్నారు. తరతరాలుగా గోదారమ్మతో అనుబంధం పెనవేసుకుని బ్రతుకున్న పరివాహక ప్రాంత వాసులు వానాకాలం వచ్చిందంటే చాలు బిక్కు బిక్కుమంటున్నారు. సీజన్ వచ్చిందంటే చాలు సాగు చేసుకునే పనిలో నిమగ్నమయ్యే రైతులు గత ఐదారేళ్లుగా మీనామేషాలు లెక్కిస్తున్నారు. ఆలస్యంగా సాగు చేయడమా లేక వ్యవసాయాన్నే వదులుకోవడమా అని తర్జనభర్జనలు పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రమంతా సస్యశామలం చేస్తోందని చెప్తున్న ప్రభుత్వం సమీపంలో ఉన్న పంట పొలాల గురించి పట్టించుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల బ్యాక్ వాటర్ తో పరివాహక ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వేల అంచనాలను మించి సాగు భూములు ముంపునకు గురవుతున్నా తమను మాత్రం పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వచ్చిన వరదల కారణంగా రెండు బ్యారేజీల బ్యాక్ వాటర్ లో పెద్ద ఎత్తున భూములు ముంపునకు గురయ్యాయి. దీంతో రైతులు వేసిన నాట్లు అన్ని కూడా జలమయం కావడంతో నష్టాల పాలయ్యారు. దుక్కి దున్ని నాట్లు వేసి మొక్కల ఎదుగుదల కోసం ఎరువులు వాడామని ఇప్పుడు వరదలు వచ్చి పంటలను ముంచడంతో తమపై ఆర్థిక భారం పడిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆరెంద మల్లారం నుండి మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల, మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ తో మహారాష్ట్రలోని సిరొంచ తాలుకాలోని 12 గ్రామాలు, భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ లోని పలు గ్రామాలకు చెందిన వ్యవసాయ భూములు ముంపునకు గురవుతూనే ఉన్నాయి.
చెన్నూరులో ధైన్యం…
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని సుందరశాలతో పాటు సమీప గ్రామాల రైతులు ధీనావస్థలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. అన్నారం బ్యారేజీకి ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వస్తున్న వరద నీటితో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వచ్చిన బ్యాక్ వాటర్ కారణంగా ఒక్క సుందరశాల గ్రామంలోనే 800 ఎకరాల భూములు అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ లో ముంపునకు గురయ్యాయంటే ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బ్యారేజ్ నుండి దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నా ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరద ప్రభావంతో బ్యాక్ వాటర్ సమీపంలోని పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మల్లారంలో…
ఇకపోతే పెద్దపల్లి జిల్లా ఆరెంద మల్లారంలో రైతుల మరిస్థితి మరీ దయనీయమైనే చెప్పాలి. వీరు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుండి పంట పొలాల వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితే నెలకొంది. గోదావరి, మనేరు నందుల సంగమం ఈ గ్రామాలకు దిగువనే కలుస్తుండగా అన్నారం బ్యారేజ్ బ్యాక్ వాటర్ కూడా ఇక్కడి వరకు వచ్చి చేరుతాయి. దీంతో మానేరు, గోదావరి జలాల నీరు ఒత్తిడికి గురై బ్యాక్ వాటర్ సమీపంలోని సుమారు 500 ఎకరాల పంట భూముల్లో నీరు వచ్చి చేరుతోంది. దీంతో వ్యవసాయ భూముల్లో నిలువెత్తు నీరు వచ్చి చేరుతుండడంతో వ్యవసాయాన్నే వదిలేసుకున్నారు బాధిత గ్రామాల రైతులు. ఇక్కడ బ్యాక్ వాటర్ పంట పొలాల్లోకి రాకుండా కరకట్ట నిర్మించినా ఫలితం లేకుండా పోగా, ప్రతి సీజన్ లో ఏదో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
మేడిగడ్డ ఎఫెక్ట్ తో…
మేడిగడ్డ బ్యారేజ్ ఎఫెక్ట్ తో మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వరకు ఉన్న సమీప గ్రామాల పంటలు నీట మునిగిపోతూనే ఉన్నాయి. అదనంగా ముంపునకు గురవుతున్న భూములపై సర్వే కూడా చేసిన అధికారులు వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే మండలంలో అత్యంత విలువైన మిర్చి పంట సాగవుతుంది. ఎక్స్ పోర్ట్ క్వాలిటీ మిర్చి సాగుకు కేరాఫ్ గా మారిన మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ బ్యారేజీ బ్యాక్ వాటర్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.