ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు కూల్చివేతపై సీరియస్…
నివేదిక కోరిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…
దిశ దశ, హుజురాబాద్:
సర్కారు భవనాన్ని వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న వ్యవహారం బెడిసికొట్టినట్టుగా ఉంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వాస్తు పేరిట భవనంలో కూల్చివేత ప్ర్రక్రియకు కూడా బ్రేకులు పడ్డాయి.
అసలేం జరిగిందంటే..?
హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ భవనం వాస్తు ప్రకారం లేదన్న కారణంతో కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. మంగళవారం భవనంలోని కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ పనులను తొలగించడంతో పాటు మెయిన్ డోర్ వంటి వాటిని మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వాస్తు పేరిట మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారన్న ప్రచారం గుప్పుమంది. గతంలో ఈ క్యాంపు ఆఫీసులో నివాసం ఉన్న ఈటల రాజేందర్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారన్న కారణంతోనే భవనం డిజైన్ లో మార్పులు చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ విషయం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి వెల్లడంతో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించినట్టు సమాచారం. ప్రభుత్వ భవనాన్ని కూల్చివేసే విషయంలో జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించడం సరైన చర్య కాదని అధికార యంత్రాంగం అంటోంది. సంబంధిత శాఖల అధికారులకు లేఖలు రాసి ఇందుకు సంబంధించిన అనుమతులు తీసుకోవడం, నిధుల కెటాయింపు తదితర అంశాలకు సంబంధించిన కరస్పాండెన్స్ లేకుండానే వాస్తు పేరిట డిజైన్ మార్చేందుకు పూనుకున్న తీరుపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనానికి వాస్తు దోషం కారణంగా మరమ్మత్తులకు శ్రీకారం చుట్టారన్న విషయం వెలుగులోకి రావడంతో బుధవారం పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.