దిశ దశ, హుజురాబాద్:
కిటకిటలాడుతున్న బస్సు నడిపే పరిస్థితిలో లేదని ఓ ఆర్టీసీ డ్రైవర్ వాపోయాడు. ఫుట్ బోర్డుపై కూడా ప్రయాణీకులు నిల్చోవడంతో సైడ్ మిర్రర్ లో వ్యూ కనిపించని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా వినకుండా బస్సులోంచి ప్రయాణీకులు దిగకపోవడంతో చివరకు నడి రోడ్డపై బస్సును నిలిపివేశాడు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. గురువారం సిరిసిల్ల డిపో బస్సు వరంగల్ కు వెలుతుండగా హుజురాబాద్ బస్ స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులు బస్సులో గబగబా ఎక్కేశారు. ఓవర్ లోడ్ అవుతుందని, బస్సును నడిపే పరిస్థితి ఉండదని డ్రైవర్ ప్రయాణీకులను వారించినా వినిపించుకోకుండా ఎక్కేశారు. కిక్కిరిసిపోయిన బస్సు నెమ్మదిగా బస్ స్టేషన్ నుండి వరంగల్ హైవే పైకి చేరుకుంది. అయితే సైడ్ మిర్రర్ ద్వారా వ్యూ చూసే పరిస్థితి లేకపోవడంతో ఇతర వాహనాల రాకపోకలు గమనించే పరిస్థితి కూడా లేకుండా పోయింది డ్రైవర్ కు. దీంతో బస్సును రోడ్డుపై అలాగే నిలిపివేసి ముందుకు కదిలేది లేదని తేల్చి చెప్పాడు. సైడ్ మిర్రర్ నుండి సైడ్ వ్యూ చూడనట్టయితే ప్రమాదాలు జరుగుతాయని దీనివల్ల ఇతర వాహనాలపై వెల్లే వారు గాయాలపాలవుతారని డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్సులోని ప్రయాణీకులు తనకు సహకరించి దిగిపోవాలని అభ్యర్థించాడు. దీంతో కొంతమంది ప్రయాణీకులు డ్రైవర్ చెప్పిన విషయాన్ని గమనించి దిగిపోవడంతో బస్సను యథావిధిగా వరంగల్ కు తీసుకెళ్లారు.