దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో డిఫరెంట్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఇంతకాలం పెద్ద దిక్కుగా ఉన్న ఆ నాయకునికి క్రమక్రమంగా దూరం అవుతున్నాయి పార్టీ శ్రేణులు. అధినేతతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న వారిలో ఒకడిగా ఉన్న ఆ నేత ఇప్పుడు ఎదురీదుతున్న తీరుపై ఇంటా బయట చర్చ కొనసాగుతోంది.
అన్ని ఆయన చుట్టే…
కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో లీడర్, క్యాడర్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడితే వాటిని చక్కదిద్దే బాధ్యత మాజీ ఎంపీ వినోద్ కుమార్ భుజాన వేసుకునే వారు. స్థానిక క్యాడర్ కూడా ఆయన వద్దకే వెల్లి చెప్పుకునే పరిస్థితి ఉండేది. పార్టీకి చెందిన నాయకులకు, ఎమ్మెల్యే లేదా ఇంఛార్జికి మధ్య ఉన్న అంతరం గురించి వివరించేందుకు ఆయా సెగ్మెంట్లకు చెందిన నాయకులు వినోద్ కుమార్ కు చెప్పుకోవడం వాటిని చక్కదిద్దాలని అభ్యర్థించడం పరిపాటిగా సాగేది. నాయకుల మధ్య గ్యాప్ ఏర్పడి వర్గాలుగా విడిపోయినా వారంతా కూడా వినోద్ కుమార్ తో మాత్రం సాన్నిహిత్యంగా మెదిలే వారు. 2018 ఎన్నికల తరువాత క్యాబినెట్ కూర్పు విషయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మెప్పించి ఓప్పించే బాధ్యత కూడా ఆయనపైనే పడింది. వేములవాడలో అభ్యర్థి మార్పు విషయంతో పాటు సిరిసిల్లకు సంబంధించిన వ్యవహారాలపై కూడా ఆయన చొరవ చూపించాల్సి వచ్చింది. హుజురాబాద్ కు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు తమపై అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ఇంఛార్జిపై ఫిర్యాదులు చేయడం, చొప్పదండి పార్టీ నాయకత్వం సిట్టింగుపై వ్యతిరేకతను ప్రదర్శించడం వంటి అంశాల పరిష్కారంలో కూడా బోయినపల్లి వినోద్ కుమార్ ప్రమేయం కంపల్సరీ అన్నట్టుగా ఉండేది.
ఆయన వరకు వచ్చేసరికి…
తాజాగా జరుగుతున్న లోకసభ ఎన్నికలు వచ్చేసరికి ఆయన పరిస్థితి అయోమయంగా మారిపోయింది. అధినేత కేసీఆర్ ఆయనపై విశ్వాసం ఉంచి మరీ టికెట్ ఇచ్చినప్పటికీ పార్టీ క్యాడర్ ఒక్కొక్కరుగా జారీ పోతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. సెగ్మెంట్ స్థాయి నుండి క్షేత్ర స్థాయి లీడర్లకు పెద్దన్నలా ఉన్న వినోద్ కుమార్ నేడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో గులాభి పార్టీకి అనూకూలమైన వాతావరణం లేకుండా పోయింది. అధికారం ఉంటేనే బావుంటుందన్న నమ్మకంతో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీవైపు అడుగులు వేస్తున్నారు. కొంతమంది బీజేపీలో చేరుతున్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో్ చేరేందుకే ఉత్సుకత చూపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ కు చెందిన కార్పోరేటర్లతో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇంకా వలసల పరంపర కొనసాగే అవకాశాలే ఉన్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. తన ఎన్నికల నాటికి పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేస్తారన్న ఆశతో ఇంతకాలం వారిని అక్కున చేర్చుకున్న వినోద్ కుమార్ కు చాలా మంది నాయకులు దూరం అవుతున్న తీరు ఆందోళన కల్గిస్తోంది. పార్టీని వీడుతున్న వారి గురించి అభ్యర్థి వినోద్ కుమార్ కూడా స్పందించారు. ఇలా పార్టీని వదిలివెల్లడం సరికాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు పార్టీ శ్రేణులకు పెద్దదిక్కుగా వ్యవహరించిన వినోద్ కుమార్ ను ఒంటిరిని చేస్తున్న తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.