ఎన్ రోల్ చేసిందెవరూ… గెలిచిందెవరూ..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం

దిశ దశ, కరీంనగర్:

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం సంచలనంగా మారింది. అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంజిరెడ్డి విజయం సాధిస్తారా లేదా అన్న సంశయం మొదట్లో వ్యక్తం అయినప్పటికీ చివరికి విజయం ఆయన్నే వరించింది. దీంతో ఎన్నికలపై సరికొత్త చర్చ జరుగుతోంది.

నమోదు చేసిందెవరూ..?

గ్రాడ్యూయేట్స్ ఎన్నికల ప్రక్రియ కోసం ఏడెనిమిది నెలల క్రితం నుండి ప్రచార పర్వంలోకి దిగినప్పటికీ బీజేపీ మాత్రం నామినేషన్ల ప్రక్రియకు కొద్ది రోజుల ముందు కార్యరంగంలోకి దిగింది. చిన్నమైల్ అంజిరెడ్డి పేరును ఖరారు చేసే సరికే పట్టభద్రలను ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ ముగిసిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో విజయతీరాలను తాకాలని సంకల్పించిన అభ్యర్థులు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ, ట్రస్మా నేత యాదగిరి శేఖర్ రావు, ముస్తాక్ తదితరులంతా కూడా భారీగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఒక్క వి నరేందర్ రెడ్డే లక్షా 30 వేల వరకూ ఓట్లను నమోదు చేశారంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఆయన ఏ స్థాయిలో కార్యాచరణ రూపొందించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వేలాది మందిని వివరాలను ఎన్ రోల్ చేసేందుకు బరిలో నిలబడాలని తహతహలాడిన వారంతా కూడా ఉత్సుకత చూపించారు. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని మరీ ఎన్నికల కోసం సన్నద్దం అయ్యారు.

ఆయన అలా…

బీజేపీ టికెట్ ఆశించిన అడ్వకేట్, సీనియర్ నేత పి సుగుణాకర్ రావు కూడా ఎన్ రోల్ మెంట్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు అధిష్టానం. అనూహ్యంగా తెరపైకి వచ్చిన అంజిరెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన బరిలో నిలిచారు. అయితే ఓటరు నమోదు ప్రక్రియ కూడా చేపట్టిన అంజిరెడ్డిని ఎమ్మెల్సీ పదవి వరించడం విశేషం. ఓటరు నమోదు కోసం శ్రమించింది వేరే నాయకులు అయితే నమోదు ప్రక్రియలో నామమాత్రంగా కూడా చొరవ చూపని అంజిరెడ్డి మాత్రం గెలవడం గమనార్హం. ఇందుకు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, బీజేపీకి అనుకూలమైన వాతావరణం కలిసి రావడం అసలు కారణం అయినప్పటికీ మొదటి నుండి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కసరత్తులు చేసిన వారిని మాత్రం ఫలితం నిరాశ పర్చినట్టయింది.

You cannot copy content of this page