ఈసీఐ నిర్ణయంతో కలకలం
దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన రోజుల వ్యవధిలోనే భారత ఎన్నికల సంఘం ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఎవరూ ఊహించని విధంగా పలువురు అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు గురువారం సాయంత్రం కల్లా ఆయా స్థానాల్లో నియమించాల్సిన అధికారుల ప్యానెల్ కూడా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఏనాడు లేని విధంగా ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులను పక్కన పెట్టాలని సూచించడం అధికారవర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. ఈసీఐ కొరడా ఝులిపించేందుకు తొలి అస్త్రం ఉన్నతాధికారుల నుండే మొదలు పెట్టినట్టుగా స్పష్టం అవుతోంది.
ఈసీఐ జాబితాలో ఉన్నదెవరో..?
యాదాద్రి, నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, వరుణ్ రెడ్డి, హరీష్, అమయ్ కుమార్, హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు సీవి ఆనంద్. వి రంగనాథ్, వి సత్యనారాయణ, సూర్యపేట, సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, నారాయణ పేట, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీలు ఎస్ రాజేంద్ర ప్రసాద్, ఎం రమణ కుమార్, బి శ్రీనివాస్ రెడ్డి, ఎ భాస్కర్, కె నర్సింహ, కె మనోహర్, కె సృజన, జి చంద్రమోహన్, ఎన్ వెంకటేశ్వర్లు, పి కరుణాకర్ లను బదిలీ చేయాలని ఈసీఐ ప్రతిపాదించింది.
ఉన్నతాధికారులూ…
జిల్లాలను పర్యవేక్షించే అధికారులే కాకుండా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై కూడా ఈసీఐ కొరడా ఝులిపించడం గమనార్హం. రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఎక్సైజ్ డైరక్టర్ ముషారాఫ్ అలీ ఫారూఖీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టికె శ్రీదేవిలను కూడా బదిలీ చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
దేశంలోనే అరుదు…
అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత పక్షపాత ధోరణీతో అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు అందుకున్నట్టయితే ఈసీఐ రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఇందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసేది. అయితే ఈ సారి మాత్రం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సమీక్షా సమావేశం ముందస్తుగా ఏర్పాటు చేసిన తరువాతే ఎన్నికల కమిషన్ అధికారులను బదిలీ చేయాలని ఆదేశించడం సంచలనంగా మారింది. నోటిఫికేషన్ విడుదలైన 50 గంటల వ్యవధిలోనే ముఖ్యమైన అధికారులను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడం అధికారవర్గాలను కలవరపెడుతోందని చెప్పవచ్చు. ఇలాంటి సంఘటనలు దేశంలోనే అత్యంత అరుదుగా జరిగి ఉంటాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒక జిల్లా అధికారిని బదిలీ చేయాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేస్తేనే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారేది. అలాంటిది తెలంగాణాలో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులను బదిలీ చేయాలని దిశా నిర్దేశం చేయడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
ఇంకా ఉంటాయా..?
అయితే రాష్ట్రంలో అధికారపార్టీకి వత్తాసు పలికిన అధికార యంత్రాంగమే లక్ష్యంగా ఈసీఐ ఆదేశాలు జారీ చేస్తుండడంతో ఇలాంటి ఆదేశాలు మరిన్ని ఉండే అవకాశాలు కూడా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి విడుతలో జిల్లా స్థాయి అధికారుల వరకు బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన తరువాత రెండో విడుతలో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తూ ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల జాబితా కూడా ఈసీఐ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. వారందరిని కూడా నాన్ ఫోకల్ పోస్టింగుల్లోకి పంపించి నాన్ ఫోకల్ పోస్టింగుల్లో ఉన్న వారికి ఫోకల్ పోస్టింగులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలను కూడా ప్రామాణికంగా తీసుకుని ఒకరిద్దరు అధికారులను బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో ఆ అధికారులు వ్యవహరించిన తీరుపై వచ్చిన పిర్యాదుల పరంపరను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా బదిలీలు చేసినట్టుగా సమాచారం. మరో వైపున ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు బదిలీల ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గత జూన్ లోనే ఆదేశించింది. ఈ మేరకు బదిలీల్లో కొంత పారదర్శకత పాటించినట్టయితే ఈసీఐ జోక్యం చేసుకునే అవకాశాలు కూడా ఉండేవి కావని అంటున్న వారు లేకపోలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చిన తరువాత కూడా రికమండేషన్ పోస్టింగులకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈసీఐ ఎంట్రీ ఇచ్చి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటి వరకు నాన్ ఫోకల్ పోస్టింగుల్లో ఉన్న వారికి ఫోకల్ పోస్టింగులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించలేదని, కేవలం సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు ఇచ్చిన లేఖలకు అనుగుణంగానే బదిలీల ప్రక్రియ జరగిందన్న విషయం కూడా ఈసీఐ వరకు చేరినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే ఎన్నికల వాడీ వేడి పెరగకముందే భారత ఎన్నికల సంఘం బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికల్లో మాత్రం కమిషన్ కఠినంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టయింది.