దిశ దశ, దండకారణ్యం:
సరిహద్దు దండకారణ్య అటవీ ప్రాంతంలో షెల్టర్ తీసుకుని తెలంగాణాలో ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న మావోయిస్టుల చర్యలపై పోలీసులు గట్టి నిఘా వేశారు. భద్రు నేతృత్వంలో స్పెషల్ యాక్షన్ టీమ్ సంచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న భద్రాద్రి, ములుగు జిల్లాల పోలీసు యంత్రాంగం డేగ కళ్లతో వాచ్ చేయడం మొదలు పెట్టింది. కొంత కాలంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు పునరుద్దరించే పనిలో భద్రు నిమగ్నం అయినట్టుగా సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని ఆచూకి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇటీవల కొత్తగూడెం ఏరియాలో భద్రు సంచరించాడన్న సమాచారం అందుకున్న పోలీసులు సరిహధ్దుల్లో గాలింపు చర్యలు చేపట్టారు. తరుచూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నాడన్న సమాచారం కూడా పోలీసులు అందుకున్నారు. అతని కుటుంబ సభ్యులు భూపాలపల్లి జిల్లాలోని ఓ మండలంలో నివాసం ఉంటున్నారని అక్కడకు తరుచూ వచ్చిపోతున్నాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే భద్రూ భద్రాద్రి, ములుగు జిల్లాల్లో దాడులకు పూనుకునే అవకాశం లేకపోవడంతో భూపాలపల్లి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి ఉంటాడన్న అనుమనాలు కూడా వ్యక్తం అయ్యాయి. కానీ భద్రు టీమ్ కు అనువైన అవకాశం చిక్కలేదో లేక కామన్ టూర్ చేశాడోనన్న విషయంపై క్లారిటీ లేదు కానీ పోలీసులు మాత్రం అతని కదలికలపై సునిశితంగా దృష్టి సారించారు. సరిహధ్దు ప్రాంతాల్లో అతన్ని కట్టడి చేయనట్టయితే రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ ఉనికిని చాటుకుంటుందన్న కారణంగా అటు నిఘా వర్గాలు ఇటు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. గతంలో మలుగు, భద్రాద్రి జిల్లాల్లో భద్రు డెన్ లపై బలగాలు దాడి చేసినప్పటికీ తృటిలో తప్పించుకున్న సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయనతో పాటు ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా కమిటీ కార్యదర్శి మరో ఐదుగురు నక్సల్స్ చనిపోయారు.
ఎన్ కౌంటర్ మృతుల వివరాలు…
ఆదివారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని చల్పాక అటవీ ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాలకు, మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ నక్సల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా చర్మాంగికి చెందిన కురుసం మంగు అలియాస్ భద్రు, అలియాస్ పాపన్న (35) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్న భద్రూ ఏకె 47 తుపాకిని వినియోగిస్తున్నడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్ కు చెందిన ఎగులోపు మల్లయ్య అలియాస్ మధు(43) ఏటూరునాగారం, మహదేవపూర్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పని చేస్తున్న ఆయన ఏకె 47 తుపాకి వినియోగిస్తున్నాడు. బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోని తంబల్ బట్టి నివాసి, ఏరియా కమిటీ సభ్యుడు ముసాకి దేవల్ అలియాస్ కరుణాకర్ (22) జి3 రైఫిల్ వినియోగిస్తున్నాడు. చత్తీస్ గడ్ లోని భైరంఘడ్ తాలుకా పూర్వాడకు చెందిన ముసాకి జమున(23) ఏరియా కమిటీ సభ్యురాలిగా పనిచేస్తోంది. ఇంద్రావతి ఏరియాకు చెందిన పార్టీ సభ్యుడు జైసింగ్ (25) 303 ఆయుధాన్ని వినియోగిస్తున్నాడు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పంపాడ్ నివాసి, పార్టీ సభ్యునిగా ఉన్న కిషోర్ (22) ఇన్సాస్ వెపన్ వినియోగిస్తున్నాడు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లన్నపేట నివాసి పార్టీ సభ్యునిగా ఉన్న కామేష్ (23) ఎస్బీబీల్ ఆయుధాన్ని వినియోగిస్తున్నాడు.
పీఎల్జీఏ వారోత్సవాలకు ముందే…
మరో 24 గంటల నుండి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) వారోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. కొయ్యూరు ఎన్ కౌంటర్ లో మరణించిన సీసీ మెంబర్ నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యాం ఆలోచనల నుండి పుట్టుకొచ్చిందే. ఆ ఎన్ కౌంటర్ మృతులను స్మరించేందుకు పీపుల్స్ వార్ పార్టీ 2000 డిసెంబర్ 2 నుండి పీఎల్జీఏ వారోత్సవాలకు శ్రీకారం చుట్టింది. సోమవారం నుండి దేశవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని పార్టీ మిలటరీ కమిషన్ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో సరిహద్దు అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారు జామున బ్యానర్లు వెలిశాయి. మరో వైపున అదే సమయంలో ములుగు జిల్లా సరిహధ్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్ష్యం అయ్యాయి. ఈ ఘటనలు జరిగిన 24 గంటల్లోగానే భారీ ఎన్ కౌంటర్ జరగడం సంచలనంగా మారింది.
అచ్చిరాని ములుగు జిల్లా…
ములుగు జిల్లా సరిహద్దుల్లో పార్టీకి అచ్చి రావడం లేదా..? ఇటీవల ఈ అటవీ ప్రాంతంలో జరుగుతున్న వరస ఎన్ కౌంటర్లే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో అన్నె సాగర్ మరణించగా పలుమార్లు ఎదురు కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. విధ్వంసాలకు పాల్పడేందుకు ఏర్పాటు చేసిన మందుగుండు సామగ్రిని కూడా ములుగు జిల్లా పోలీసులు బయటకు తీసి మావోయిస్టుల ప్లాన్ ను విఫలం చేశారు. ములుగు, చత్తీస్ గడ్ సరిహధ్దులను ఆనుకుని ఉన్న కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ బలగాలు నిరంతరం గాలింపు చర్యలు చేస్తున్నాయి. దీంతో మావోయిస్టుల ఉనికికి ఆదిలోనే చెక్ పడుతోందని పోలీసు వర్గాలు అంటున్నాయి.