మంత్రి కొప్పుల వెల్లడి
ధర్మపురి నియోజకవర్గంలో నిర్మించతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ వల్ల ప్రత్యక్ష్యంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి సమీపంలోని ప్రభుత్వ భూమి చదును చేసేందుకు భూమి పూజ నిర్వహించారు. గుట్ట బోరు చదును చేసేందుకు రూ. 13 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏటా 8 కోట్ల లీటర్ల సామర్థ్యం ఇథనాల్ పరిశ్రమ మొత్తం వంద ఎకరాల్లో నిర్మించనున్నారు. రైతాంగానికి కూడా అండగా ఉండే ఆ ప్రాజెక్టు వల్ల అన్ని వర్గాలకు లాభదాయకమేనన్నారు. బడుగు, బలహీనవర్గాలు అత్యధికంగా ఉన్న ధర్మపురి ప్రాంతంలో పెద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సంకల్పించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. జగిత్యాల ప్రాంతంలో వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన నేపథ్యంలో నీటి వసతి, వరి, మక్క పంట పండే పరిస్థితులు ఉన్న ధర్మపురి ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. రూ. 700 కోట్లతో క్రిభ్ కో, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమ వల్ల జిల్లా స్వరూపమే మారనుందన్నారు. త్వరలో ఇథనాల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కూడా చేయనున్నట్టు మంత్రి కొప్పుల ప్రకటించారు.