ప్రలోభాల ఎర… ఓటరు నమోదు జాతర…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశావాహుల హడావుడి

దిశ దశ, కరీంనగర్:

ఎన్నికల కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టనేలేదు. ఓటర్ల నమోదు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనేలేదు. అయినా ఆశావాహులు మాత్రం తమ ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. కరీంనగర్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసారి డిమాండ్ బాగా కనిపిస్తోంది. అటు విద్యాసంస్థల అధినేతలు, ఇటు ప్రొఫెసర్లు, వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల కదనరంగంలోకి దూకి ప్రచార పర్వం కొనసాగిస్తున్నారు. అయితే గ్రాడ్యూయేట్ కానిస్టెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో ముందుగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరగాల్సి ఉటుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 6వ తేదీ వరకు ఓటర్ల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఓటర్ల నమోదు ప్రక్రియకు ముందే వివిధ రంగాలలో స్థిరపడ్డ ప్రొఫెషనల్స్, నిరుద్యోగ పట్టభద్రులు, విద్యాలయాల అధిపతులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చే ఎన్నికల్లో తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఎన్నికల కమిషన్ శంఖారావం పూరించకముందే ప్రచార పర్వానికి తెరలేచినట్టయింది.

ప్రలోభాల పర్వం…

తాము ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరాలని నిర్ణయించుకున్న ఒకరిద్దరు అభ్యర్థులు అప్పుడే ప్రలోభాల పర్వానికి కూడా శ్రీకారం చుట్టారు. ఆయా వర్గాలను మచ్చిక చేసుకొనేందుకు గిఫ్ట్ లు ఇవ్వడంతో పాటు ఇతరత్రా అంశాల్లో తమ వంతు సహకారం అందిస్తామంటూ ముందుకు వస్తుండడంతో గమనార్హం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో తిరుగుతున్న అభ్యర్థులు అక్కడి పట్టభద్రులు చెబుతున్న అంశాలను పరిగణన తీసుకొని వారి అవసరాలను తీర్చేందుకు ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రలోభాల పర్వం మొదలు కావడం విశేషం. పట్టభద్రులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ప్రదర్శిస్తున్న దూకుడు తీరు అన్ని వర్గాలను విస్మయానికి గురి చేస్తొంది. సాధారణ ఎన్నికలను మరిపిస్తున్నట్టుగా అభ్యర్థులు పట్టభద్రులను మచ్చిక చేసుకునేందుకు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఈ స్థాయిలో ప్రలోభాలు మొదలయ్యాయంటే… నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ స్థాయికి చేరుతుందోనన్న అంశంపై విద్యావంతుల్లో డిస్కషన్ మొదలైంది.

నమోదు ప్రక్రియ…

ఇకపోతే పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమంపై కూడా ఆశావాహులు మరో అడుగు ముందుకేశారనే చెప్పాలి. వారి పేర్లను ఓటర్ నమోదు జాబితాలో చేర్చేందుకు కూడా అభ్యర్థులు చొరవ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొందరైతే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఎన్ రోల్ మెంట్ ప్రక్రియకు నడుంబిగించాలని పురమాయించినట్లుగా తెలుస్తోంది. పీఆర్వో వ్యవస్థ ద్వారా ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. ఇందుకోసం కంప్యూటర్లు ఏర్పాటు చేసి ఒక్కో ఉద్యోగికి 100 నుండి 200 మంది ఓటర్లను నమోదు చేయించేందుకు బాధ్యతలు అప్పగించినట్టుగా తెలిసింది. దీంతో ఈసారి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు సరికొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశాయని స్పష్టం అవుతోంది. వాస్తవంగా ఎన్నికల కమిషన్ ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. కమిషన్ మాత్రమే చేయాల్సిన ఈ పనిని ఆశావాహులు తమ భుజాలపై వేసుకున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి సరికొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయని స్పష్టమవుతోంది.

You cannot copy content of this page