బావి నీటిలో తేలిన మొండెం… అడుగు భాగంలో లభ్యమైన తల

పరీక్షలే నిగ్గు తేల్చాలి…

దిశ దశ, మానకొండూరు:

జ్యోతిష్యతి డిప్లోమా స్టూడెంట్ అభిలాష్ మిస్సింగ్ మిస్టరీలో ట్విస్ట్ ల మీదు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అదృశ్యం అయినప్పటి నుండి శవమై తేలిన తీరులోనే ఎన్నెన్నో అనుమానాలు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా నీటి అడుగున కపాలమొకదానిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో అసలేం జరిగింది అన్నది తేలాలంటే ఫోరెన్సిక్ రిపోర్టులు వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేకుండా పోయింది. సవాల్ గా మారిన అభిలాష్ మరణంపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

తలకు మించిన అనుమానాలు

మార్చి 1న అనూహ్యంగా మిస్సయిన అభిలాష్ ఆ తరువాత నుండి ఎవరికీ కనిపించకుండా పోయాడు. 27వ తేది అల్గునూరులోని వ్యవసాయ బావిలో తల లేని మొండాన్ని గుర్తించడంతో ఈ మిస్టరినీ ఛేదించాలని పోలీసులు మరింత పట్టుదలతో ముందుకు సాగారు. తల లేకుండానే డెడ్ బాడీ ట్రేస్ కావడంతో నీటిలోనే తల ఉండి ఉంటుందన్న అనుమానంతో బావిలోని నీటిని తోడించి అడుగు భాగంలో ఉన్న తలను స్వాధీనం చేసుకున్నారు. 27న తల లేని మొండానికి పోస్టు మార్టం చేయించడంతో పాటు మంగళవారం బావిలో దొరికిన తలకు కూడా ప్రత్యేకంగా పోస్టుమార్టం చేయించారు. అయితే ఈ తల అభిలాష్ దేనా కాదా అన్న విషయం తెలుసుకునేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొండెం నుండి సేకరించిన అవయవాలను ఫోరెన్సిక్ సైంటిఫిక్ లాబోరేటరికి పంపించారు. అయితే తల అతనిదే కాదా అన్న విషయాన్ని రూఢీ చేసుకునేందుకు సూపర్ ఇంపోజిషన్ కోసం పంపించారు. ఇంపోజిషన్ లో నిపుణులు సైంటిఫిక్ గా అంచనా వేస్తారని దీంతో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు.

అలా అయితే…

అభిలాష్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక… హత్యకు గురయ్యాడా అన్న అనుమానాలు కూడా ఎక్కువయ్యాయి. తల నీటి అడుగున లభ్యం కావడంతో శరీరం నుండి ఎలా వేరు పడిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి., సాధారణంగా వెన్నుముకతో తల ప్రాంతం అనుసంధానమై ఉంటుంది. అతి బలమైన గాయం అయితే తప్ప తల, మొండెం వేరయ్యే అవకాశాలు లేవు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అభిలాష్ మార్చి 1 రాత్రి నుండి మొబైల్ స్విచ్చాఫ్ అయి ఉండడంతో ఏఏ టవర్ లోకేషన్స్ లో తిరిగి ఉంటాడన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. మరో వైపున ఆయనను హత్య చేశారా అన్న అనుమానాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులకు ఎక్కడ కూడా ఎలాంటి క్లూ లభ్యం కానట్టుగా తెలుస్తోంది. అయితే శవం లభ్యమైన వ్యవసాయ బావి లోతుగా వెల్లినాకొద్ది ఇరుకుగా ఉండడంతో అభిలాఫ్ అందులో పడిపోయినప్పుడు తల కిందులగా పడడంతో బలమైన గాయం అయి ఉంటుందని దీంతో తల, మొండెం వేరయ్యే అవకాశం ఉంటుందని ఓ అంచనా. అతను నీటిలో పడి చనిపోయాడా లేక… హత్య చేశారా అన్న విషయంపై క్లారిటీ రావాలంటే డయాట్రామ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు కడుపులో ఉన్న నీటి ఆనవాళ్లు కానీ మోకాలు ప్రాంతంలోని ఎముకను కానీ పరీక్షలకు పంపించినట్టయితే క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అయితే 27 రోజుల పాటు నీటిలోనే ఉండడంతో క్రిమికీటకాలు మాంసాన్ని తినడం వల్ల ఈ పరీక్షల కోసం అవసరమై శరీర భాగాలను సేకరించినప్పటికీ పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాలు లేనట్టుగా తెలుస్తోంది. పోలీసులు మాత్రం ఈ కోణంలోనూ సైంటిఫిక్ గా తెులుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ హత్య చేసి నీటిలో పడేసినట్టయితే చనిపోయిన వ్యక్తి నీటిని తాగే అవకాశం లేనందున డయాట్రామ్ టెస్ట్ తో వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అభిలాష్ మిస్టింగ్ అయినప్పటి నుండి అసలేం జరిగింది అన్న కోణంలో పోలీసులు తెలుసుకునే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది అధికారికంగా స్పష్టత రావాలంటే మాత్రం నిపుణుల నుండి వచ్చే నివేదికలే కీలకంగా మారాయి.

You cannot copy content of this page