దిశ దశ, వరంగల్:
సీనియర్ డాక్టర్… సీనియర్ పొలిటిషియన్ భవితవ్యం ఏమిటీ..? మొట్టమొదట అధిష్టానాన్ని ధిక్కరించిన ఆయనను ఇతర పార్టీలు ఎందుకు అక్కున చేర్చుకోవడం లేదు..? పూర్వాశ్రమం నుండి పిలుపొచ్చినా చివరి నిమిషంలో ఎదురైన నిరాశతో ఆయన అడుగులు ఎటువైపు ఉండబోతుందన్నదే ప్రశ్నార్థకంగా మారింది.
స్వరాష్ట్రం కోసం…
ఉద్యమ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీని వీడి గులాభి జెండా ఎత్తుకున్న తాటికొండ రాజయ్యకు స్వరాష్ట్రం సిద్దించిన తరువాత మాత్రం అంతగా కలిసిరానట్టుగానే ఉంది. ఉద్యమ సమయంలో ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగడంతో పాటు అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెల్లిన సందర్బాలు ఎన్నెన్నో. అయినా ఆయన మాత్రం ఎన్నికల బరిలో నిలబడడం గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం సాధారణంగా మారింది. 2014లో తొలిసారి ఏర్పడిన తెలంగాణ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తాటికొండ రాజయ్యను అధినేత కేసీఆర్ ఆ బాధ్యతల నుండి తప్పించారు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామాలు అటు గులాభి శ్రేణులను, ఇటు తెలంగాణ ప్రజలకు కూడా అంతుచిక్కలేదు. రాజయ్యను మంత్రివర్గం నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి అసలు కారణం ఇదేనంటూ జరిగిన ప్రచారానికి అడ్డేలేకుండా పోయింది. కానీ వాస్తవం మాత్రం నేటికి వెలుగులోకి రాకపోవడం విచిత్రమనే చెప్పాలి. 2018 ఎన్నికల సమయంలో కూడా రాజయ్యకు టికెట్ రాదని, ఆయన అభ్యర్థిత్వాన్ని చివరి నిమిషంలో రద్దు చేస్తారంటూ జరిగిన ప్రచారంతో ఆయన ప్రజా క్షేత్రంలోనే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పట్టుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 2023 ఎన్నికలప్పుడు కూడా ఇదే ప్రచారం ఊపందుకున్నప్పుడు కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు రాజయ్య. తీరా వేళకు ఆయన టికెట్ నిరాకరించి స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ఫైనల్ చేసింది అధిష్టానం.
పార్టీలోనే…
అయితే రాజయ్యకు టికెట్ నిరాకరించడంతో వేరే పార్టీ నుండి నిలబడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో అంతా సద్దుమణిగిపోయిందనుకున్నప్పటికీ ఎన్నికల తర్వాత అధిష్టానానికి బిగ్ షాక్ ఇచ్చారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగేది లేదని కుండబద్దలు కొట్టిన రాజయ్య తీరుతో ఆయన ఎంపీ టికెట్ కోసం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన మాత్రం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజయ్య విషయంలో క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఆయన సొంతగూటికి చేరే విషయంలో సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారన్న ప్రచారం జరిగినా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో ఆయన అటు బీఆర్ఎస్ పార్టీలో లేక కాంగ్రెస్ పార్టీలో చేరక నిశ్శబ్దంగా ఉండిపోయారు.
ఎంపీ టికెట్ రేసులో…
తాజాగా వరంగల్ లోకసభ స్థానంలో నెలకొన్న పరిణామాలతో మళ్లీ రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ అవాకశం వస్తుందన్న ప్రచారం జరిగింది. ఇక్కడి నుండి అభ్యర్థిగా ప్రకటించిన కడియ కావ్య, ఆమె తండ్రి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున వరంగల్ నుండి పోటీ చేసేందుకు సమాయత్తం కావడంతో మరో అభ్యర్థిని బరిలో నిలపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో మళ్లీ రాజయ్య పేరు తెరపైకి వచ్చినప్పటికి బీఆర్ఎస్ అధిష్టానం నుండి కానీ రాజయ్య నుండి కానీ స్పందన రాలేదు. చివరకు రెండు రోజుల క్రితం అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలో అధినేత కేసీఆర్ తాటికొండ రాజయ్యను పిలిపించారన్న ప్రచారం జరిగినప్పటికీ డాక్టర్ సుధీర్ బాబును వరంగల్ క్యాండెట్ గా ప్రకటించడంతో ఆయన పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది.
ఒంటరేనా..?
రాజయ్యకు రాజకీయ బద్ద శత్రువుల్లో కడియం శ్రీహరి పేరు మొదటి స్థానంలో ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కడియం, తాటికొండలు డైరక్ట్ అటాక్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సొంత పార్టీలోనే తన టికెట్ విషయంలో అడ్డుపడ్డాడని రాజయ్య బలంగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజయ్య మద్దతు ఎటు వైపు ఇస్తారన్నదే పజిల్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీని వీడడం… అధినేత కేసీఆర్ అక్కున చేర్చుకునే అవకాశం లేకపోవడంతో గులాభి కండువా తిరిగి కప్పుకునే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ గూటిలో చేరాలని ప్రయత్నించినా ఆ పార్టీ కూడా నో ఎంట్రీ బోర్డు పెట్టేయడంతో అందులో చేరలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితు్ల్లో ఆయన ఒంటరిగానే మిగిలిపోవడమే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు మాత్రం కనుచూపు మేరలో కానరావడం లేదు.