రాజకీయ దురంధరుని అస్త్ర సన్యాసం..?
దిశ దశ, నిజామాబాద్:
ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పేరు తెలియని నాయకులు ఉండరు… జాతీయ పార్టీతో దశాబ్దాల పాటు మమేకమైన ఆయన చెరగని ముద్ర వేశారు… ఆ నేత అంటే ఓ ముఖ్యమంత్రి సెంటిమెంట్ గా ఫీలయ్యేవారు. స్వ రాష్ట్ర కల సాకారం అయిన తరువాత ఉద్యమ పార్టీ పంచన చేరిన ఆయన పయనం ఇప్పుడు ఎటన్నదే అంతుచిక్కకుండా పోయింది. తనయులిద్దరూ వేర్వేరు పార్టీలో కొనసాగుతుంటే… ఆయన ఇంటికే పరిమితం కావల్సి వచ్చిందా..? లేక క్రియాశీలక రాజకీయాల్లో పాలు పంచుకుంటారా అన్నదే ఇప్పుడు అసలైన చర్చ.
ఎవరా నేత..?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దురంధరుడు… సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేశారు. పార్టీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆయన సీమాంధ్ర నాయకులను తలదన్ని మరీ తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. డీఎస్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ గా ఫీలయ్యే వారన్న పేరుంది. 2004, 2009 ఎన్నికలప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతల్లో ఉన్న ఆయనకు క్యాబినెట్ లో బెర్త్ ఖరారయి ఉండేంది. వైఎస్ మరణానంతరం కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఏఐసీసీ పెద్దలను ఒప్పించిన వారిలో డిఎస్ కూడా ఒకరు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఇమేజ్ ఉన్న నేతగా తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దదిక్కుగా ఉండే నేతల్లో ఒకరిగా మెదిలారు. ఉమ్మడి రాష్ట్రంలో అయినా తెలంగాణాలో అయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న డి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు అలుముకున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ఒకటి తలిస్తే జరుగుతున్నది మరోకటి అన్నట్టుగా మారిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉండబోతోందా లేదా అన్నది కూడా అంతు చిక్కకుండా పోయింది.
ఇంటా… బయటా…
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన చరిష్మా క్రమక్రమంగా మసకబారుతున్నట్టుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఆయన ఎంచుకున్న దారో లేక ఆయన ప్రయారిటీ తగ్గించేందుకు జరిగిన ప్రయత్నాలో తెలియదు కానీ రాజకీయ దురంధరుడిగా ఆయన ఇప్పుడు ఏకాకిగా మారిపోయారన్న వాదనలయితే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ నేతలు మంత్రాంగం నడిపిండచంతో డీఎస్ కినుక వహించి దశాబ్దాల అనుభందానికి పుల్ స్టాప్ పెట్టేశారు. ఆ తరువాత ఉద్యమ పార్టీలో చేరిన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. కొంతకాలానికి గులాభి నేతలు కూడా ఆయనపై విమర్శలు చేయడం ఆరంభించి… ఏకంగా సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అధినేతకు లేఖ రాశారు. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చలు సాగినప్పటికీ కేసీఆర్ మాత్రం ఆ విషయాన్ని మరుగున పడేశారు. ఆ తరువాత డిఎస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడంతో పాటు బీజేపీ ముఖ్యనేత అమిత్ షాను కలవడంతో కాషాయం కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా గత మార్చిలో గాంధీభవన్ లో డిఎస్ ప్రత్యక్ష్యం కావడం కలకలం సృష్టించగా మరునాడు తాను కాంగ్రెస్ లో చేరలేదని కేవలం నాయకులను కలిసేందుకు వెళ్లానని ప్రకటన ఇచ్చారు. అయితే డిఎస్ పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, చిన్న కొడుకు అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. తన వారసుల్లో ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక మిన్నకుండిపోయే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత మార్చి నుండి సైలెంట్ గా ఇంటికే పరిమితం అయిన డిఎస్ రాజకీయాలకు ఇక దూరంగా ఉండాల్సిన పరిస్థితే ఎదురైందా లేక ఆయన ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే విషయం అటుంచితే… ముందు నుయ్యి వెనక గొయ్యి నడుమ డిఎస్ అన్నట్టుగా తయారైందంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా తెలగు రాజకీయాల్లో ఓ ఇమేజ్ సంపాదించుకున్న కురు వృద్దుడు అర్థాంతరంగా రాజకీయాలకు దూరం కావల్సిన పరిస్థితులు ఎదురు కావడం విచిత్రమనే చెప్పాలి.