దిశ దశ, న్యూ ఢిల్లీ:
భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ప్రకటనకు రంగం సిద్దం చేసుకుంది. తొలి విడుత జాబితాను ఈ నెలఖారులో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి సారి దేశంలోని 160 స్థానాలకు సంబంధించిన ఈ లిస్ట్ లో ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, తెలంగాణ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలు ఉండనున్నాయి.
ఫార్మూల అదే…
చత్తీస్ గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఎన్నికల వరకు జనంతో మమేకం కావడం వల్ల పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడానికి ఇదే కారణమని గుర్తించిన జాతీయ నాయకత్వం ఇదే ఫార్ములాను లోకసభ ఎన్నికల్లోనూ అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీకి నామ మాత్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్న 160 స్థానాలను గుర్తించారు. ఈ స్థానాల్లో అభ్యర్థులను జనవరి చివరి వారంలో ప్రకటించినట్టయితే వారు నిత్యం ప్రజల్లో తిరుగుతుండడం వల్ల అన్ని విధాలుగా లాభిస్తుందని అంచనా వేస్తున్నారు. చత్తీస్ గడ్ ఫార్ములాను అనుసరించి 160 స్థానాల్లో ఎంతమంది బీజేపీ అభ్యర్థులు గెలిచిన అది తమకు బోనసేనని జాతీయ నాయకత్వం అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జనవరి నెలాఖారులో జాబితా ప్రకటించేందుకు సమాయత్తం అయింది.