బజ్జీల మాటున గంజాయి ఘాటు…

నిగ్గు తేల్చిన చందుర్తి సర్కిల్ పోలీసులు

దిశ దశ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఓ చిన్న పాటి గ్రామమది. ఆ గ్రామంలోని ఓ బజ్జి వ్యాపారి వద్దే కొనేందుకు మొగ్గు చూపుతున్నారక్కడి జనం. మూడు వేల జనాభా వరకు ఉన్న ఆ ఊర్లో ఎంతోమంది బజ్జీలు విక్రయిస్తున్నా కూడా ఆ ఒక్కరి వద్దకు వెల్లి జనం క్యూ కడుతున్నారు. ఆరు నెలలుగా సాగుతున్న ఈ తంతు గురించి ఆ నోటా ఈ నోట పోలీసుల చెవిన పడింది. అయితే పోలీసులు మాత్రం అక్కడ అమ్ముత్తున్న బజ్జీల లోగుట్టు ఏంటో తెలుసుకోవాలని నిర్ణయించారు. నెమ్మదిగా బజ్జీల అమ్మకాలు చేస్తున్న రిజ్వాన్ కదలికలపై నిఘా వేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

రుచితో ఆకర్షించే ప్రయత్నంలో…

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రిజ్వాన్ కొంతకాలంగా వివిధ రకాల బజ్జీలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన రిజ్వాన్ ఏడేళ్ల క్రితం గ్రామానికి వచ్చి బజ్జీల దందా కొనసాగిస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో తన వ్యాపారం అంతగా నడవడం లేదని ఆవేదనతో ఉన్న రిజ్వాన్ అద్దెకు ఉంటున్న ఇంటి ముందు యూపీకి చెందిన విజయ్ ఐదేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడడంతో రిజ్వాన్ విక్రయించే బజ్జీలకు డిమాండ్ రావడానికి అవసరమైన ఉపాయం ఆలోచించాడు. విజయ్ అద్దెకు ఉంటున్న ఇంటి వెనక ప్రాంతంలో ఖాలీ ప్రదేశం ఉండడం అతను గంజాయి మొక్కలు పెంచుతుండడంతో తాను అమ్ముతున్న బజ్జీల్లో గంజాయి కలిపి అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించాడు రిజ్వాన్. అనుకున్నదే తడవుగా గంజాయిని ఎండబెట్టి పొడి చేసి మిర్చి పిండిలో కలుపుతూ బజ్జీలు తయారు చేసి విక్రయించడం ఆరంభించాడు. రిజ్వాన్ విక్రయిస్తున్న బజ్జీల రుచిని చూసిన స్థానికులు అతని వద్దే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం ఆరంభించారు. గ్రామంలోని యువత రిజ్వాన్ బజ్జీలంటే ఎనలేని మక్కువ చూపిస్తున్నారు. అనతికాలంలోనే రిజ్వాన్ బజ్జీల వ్యాపారం మూడు గంజాయి ఆకులు ఆరు రూపాయలు అన్నట్టుగా అభివృద్ది చెందింది. రిజ్వాన్ వేసిన ఎత్తుతో గ్రామంలో బజ్జీల విక్రయాలు చేస్తున్న ఇతర వ్యాపారులు తమ దుకాణాలను మూసేసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది.

పోలీసుల చెవిన పడడంతో…

ఆ నోట ఈ నోట రిజ్వాన్ బజ్జీలకు ఉన్న డిమాండ్ గురించి తెలుసుకున్న పోలీసులు అతనిపై ప్రత్యేకంగా నిఘా వేశారు. రిజ్వాన్ బజ్జీల కథేంటో తెలుసుకోవాలని నిజామాబాద్ విపీఓ సత్యనారాయణను పోలీసు అధికారులు ఆదేశించడంతో బజ్జీల దందాపై ప్రత్యేక నజర్ వేశారు. రిజ్వాన్ తయారు చేస్తున్న బజ్జీలే ఎందుకంత రుచి ఉంటున్నాయి..? గ్రామంలోని యువత ఎందుకు అక్కడే కొనుక్కుని తినడానికి ఆసక్తి చూపుతోంది అన్న ప్రశ్నలు వీపీఓను వేధించాయి. నిత్యం రిజ్వాన్ కదలికలపై దృష్టి సారించి అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. రిజ్వాన్ అద్దెకు ఉంటున్న ఎదురు ఇంట్లోనే విజయ్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నారని, ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో సన్నిహితులుగా మారిపోయారని గుర్తించారు వీపీఓ. విజయ్ అద్దెకు ఉంటున్న ఇంటి ఆవరణలోనే గంజాయి మొక్కలను పెంచుతున్నాడని, అతని వద్ద సేకరించిన గంజాయి ఆకులను ఎండబెట్టి పొడి చేసి బజ్జీల పిండిలో కలిపి తయారు చేస్తున్నాడని గుర్తించారు. ఈ విషయం పోలీసు అధికారులకు వివరించడంతో చందుర్తి సీఐ కిరణ్ కుమార్, కోనరావుపేట ఎస్సై రమాకాంత్ లు వాస్తవాలను నిగ్గు తేల్చారు. విజయ్ అద్దె ఇంటి ఆవరణలో పెంచుతున్న సుమారు 10 గంజాయి చెట్లతో పాటు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వాంగ్మూలంతో పాటు ఇతరాత్ర ఆధారాలు సేకరించి రిజ్వాన్, విజయ్ లను అరెస్ట్ చేశామని చందుర్తి సీఐ కిరణ్ కుమార్ తెలిపారు.

కాఖీలు అలెర్ట్ కానట్టయితే…

చందుర్తి సర్కిల్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించనట్టయితే రిజ్వాన్ గంజాయి కలిపి అమ్ముతున్న బజ్జీలకు గ్రామస్థులంతా కూడా అడిక్ట్ అయిపోయే వారు. నిత్యం రిజ్వాన్ వద్దే బజ్జీలు తింటున్న స్థానికులు మత్తులో తూగడం ఆలవాటు పడిపోయి దాని మోతాదును పెంచుకుంటూ పోయేవారు. ఇలా కొంతకాలానికి నిజామాబాద్ గ్రామస్థులు గంజాయి మత్తులోనే తేలియాడే ప్రమాదంలో కొట్టుమిట్టాడేది. రుచికరమైన ఆహారం అందిస్తున్నాడని అందుకే గ్రామస్థులు రిజ్వాన్ వద్ద బజ్జీలు తినేందుకు ఆసక్తి చూపుతున్నారని భావించి పోలీసులు తమ దృష్టిని మరల్చినట్టయితే రెండు మూడేళ్లలో నిజామాబాద్ గ్రామస్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. గ్రామానికి చెందిన యువత ఎక్కువగా రిజ్వాన్ బజ్జీలపై ఆసక్తి పెంచుకుంటుడడం, అతను స్థానికేతరుడు కావడంతో అనుమానించిన పోలీసులు నిగ్గు తేల్చడంతో గ్రామస్థులు గంజాయి బాధితులుగా మారకుండా కట్టడిచేయగలిగారు.

You cannot copy content of this page