దిశ దశ, దండకారణ్యం:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఓ వైపు… పొంగి పొర్లుతున్న వాగులు వంకలు ఓ వైపు… కీకారణ్యంలోని ఆ గ్రామంలో పురిటి నొప్పులతో తల్లడిల్లిపోయిందా తల్లి. గ్రామస్థులు సుఖ ప్రసవం చేసినప్పటికీ… ప్రి మెచ్యూర్ డెలివరి కావడంతో బంధువులంతా ఆందోళనకు గురయ్యారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ బాలింతకు మెరుగైన వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయిందక్కడ… బలగాలు సాహసం చేసి తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించాయి. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా నయపర గ్రామానికి చెందిన మద్వి (24) ప్రి మెచ్యూర్ డెలివరి కావడంతో వారికి మెరుగైన చికిత్స అందించే అవకాశం లేకుండా పోయింది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం నుండి బాలింతను క్షేమంగా ఆసుపత్రికి తరలించేందుకు రహదారి సౌకర్యం కూడా లేదు. నంబి, నయపర గ్రామాల మధ్య ప్రవహిస్తున్న నంబిధర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్థులంతా ఏం చేయాలో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. అసలే ప్రి మెచ్యూర్ డెలివరి కావడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే వైద్యం అందించాల్సిన ఆవశ్యకత ఉందని నయపర గ్రామస్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక 196 క్యాంపు బలగాలు, 205 కోబ్రా బలగాలు తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించేందుకు సాహసం చేశారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటించేందుకు పకడ్భందీగా వ్యవహరించారు. వరద ఉధృతిలో వారిని తరలించేందుకు ఉపయోగించే బల్లకట్టు కొట్టుకపోయే ప్రమాదం ఉందని గమనించిన జవాన్లు నదికి ఇరువైపుల వరకు పటిష్టమైన తాడును ఏర్పాటు చేశారు. తాడు సహయంతో బలగాలు వరధ ఉధృతిలో నిలబట్టి తల్లి బిడ్డ తరలించేందుకు ఉపయోగించిన బల్లకట్టును గమ్యం చేర్చారు. ఆ తరువాత బాలింతను, నవజాత శిశువును ఊసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాయి బలగాలు. హోరు వానలో కూడా బలగాలు వరద ప్రవాహాన్ని లెక్క చేయకుండా బాలింతను, బిడ్డను క్షేమంగా నది దాటించడంపై స్థానికులు అభినందించారు.
మావోయిస్టుల ఇలాకా…
మరో వైపున నయపరా గ్రామం ఉన్న ప్రాంతం అంతా కూడా మావోయిస్టు పార్టీ నక్సల్స్ కు పెట్టని కోట కూడా కావడం గమనార్హం. బాలింతను, ఆమె బిడ్డను సురక్షింతంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో దాడి జరిగినట్టయితే జవాన్లు ప్రాణాలను కోల్పోయే పరిస్థితి ఉండేది. అంతేకాకుండా నదిలో తాడు సహాయంతో తల్లిబిడ్డను ఒడ్డIకు చేర్చుతున్న క్రమంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన వరద తాకిడీకి జవాన్లు కూడా కొట్టుకపోయే ప్రమాదం కూడా ఎదురయ్యేది. వీటిని లెక్క చేయకుండా దండకారణ్యంలో బలగాలు అత్యంత సాహసంతో బాలింత, ఆమె బిడ్డను తరలిస్తున్న బల్లకట్టు చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడి ఆసుపత్రికి తరలించడంలో సఫలం అయ్యారు. ప్రతికూల వాతావరణంలోనూ జవాన్లు చూపిన చొరవను పోలీసు ఉన్నతాధికారులు కూడా వారిని అభినందించారు.