తెలంగాణ ప్రభుత్వం ఇంతకాలం వ్యవహరించిన వ్యూహాత్మకమైన ఎత్తుగడకు ముగింపు ఎలా పలకబోతుందన్నదే అసలు ట్విస్ట్ గా మారింది. అసెంబ్లీ నిర్వహణలో తాను ఎంచుకున్న పంథాతో ముందుకు సాగడం ఎలా అన్న పెద్ద సవాల్ ఇప్పుడు సర్కారు ముందు ఉన్నది. గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల కాలంలో అంతరం పెరిగిన నేపథ్యంలో అసెంబ్లీకి ఆమెను ఆహ్వానించకుండా ఉండేందుకు కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగింది. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అయ్యే ప్రతి సారి కూడా గవర్నర్ ప్రసంగంతోనే సమావేశం స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. 8వ సెషన్ లో వరసగా 4 సమావేశాలు తెలంగాణ అసెంబ్లీలో నిర్వహించారు. ఇటీవల జరిగిన నాలుగు సమావేశాల ముగింపు రోజున సమావేశాలను వాయిదా వేశారు కానీ ప్రోరోగ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించలేదు. దీంతో వచ్చే బడ్జెట్ సమావేశాలు కూడా ఇలాగే సాగుతాయని భావించారంతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తీసుకున్న నిర్ణయం కొత్త ఆలోచనలకు దారి తీసినట్టయింది.
లంచ్ మోషన్ పిటిషన్ తో…
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తాము ప్రతిపాదించిన పద్దులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం హై కోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లంచ్ మోషన్ పిటిషన్ పై ప్రభుత్వం తరుపున అడ్వకేట్ దుష్యంత్ దవే, గవర్నర్ తరుపున అశోక్ రాంపాల్ లు బెంచ్ ముందు వాదనలు కూడా వినిపించారు. మద్యాహ్నం తరువాత అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవే తాము వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని కోర్టకు విన్నవించారు. అంతేకాకుండా ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని కూడా కోర్టుకు విన్నవించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు ట్విస్ట్ ఇక్కడే…
అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గవర్నర్ కు, ప్రభుత్వానికి ఏర్పడ్డ అభిప్రాయ బేధాల కారణంగా గవర్నర్ ను అసెంబ్లీకి ఆహ్వానిచకుండా ఉంటుదని సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. 8వ సెషన్స్ లో నిర్వహించిన 4వ సమావేశాలకు సంబందించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు జరిగిన సమావేశాలను వాయిదా వేయడంతోనే సరిపెట్టడం, ప్రోరోగ్ చేయకపోవడంతో ఇప్పుడు గవర్నర్ చే ఎలా ప్రసంగం చేయిస్తారన్నదే అంతుచిక్కకకుండా పోయింది. ఆర్టికల్ 173 ప్రకారం బడ్జెట్ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది కానీ గత సమావేశాన్ని ప్రోరోగ్ చేయకపోవడంతో 8వ సెషన్ కొనసాగుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. కాబట్టి ఇదే విధంగా సమావేశాలును కంటిన్యూ చేసి బడ్జెట్ ప్రవేశపెడితే మాత్రం నిభందనలు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీని ప్రోరోగ్ చేయకపోవడంతో ఇప్పుడు గవర్నర్ ప్రసంగించడం సభా సాంప్రాదాయం కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రోరోగ్ చేయని కారణంగా అసెంబ్లీ రికార్డుల ప్రకరాం సమావేశాలు కొనసాగుతున్నట్టేనని ఈ క్రమంలో సెషన్స్ మధ్యలో గవర్నర్ ప్రసంగం ప్రవేశ పెట్టడం సరికాదన్న వాదనలు నిపుణలు వినిపిస్తున్నారు. 8వ సెషన్ ను ప్రోరోగ్ చేసి 9వ సెషన్ ను కొనసాగించాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ అసెంబ్లీపై పడింది.
పరిష్కారం ఇదే…
ఇప్పటి వరకు వాయిదాల నడుమ సాగుతున్న తెలంగాణ అసెంబ్లీలో నిరవధిక వాయిదా ప్రక్రియకు సంబందించి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించి నిభందనలు, సభా సాంప్రాదాయలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవల్సి ఉంది. ఇందు కోసం కనీసం ఒకరోజైనా సమావేశాలను ఏర్పాటు చేసి అసెంబ్లీని ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత 9వ సెషన్ కు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేసి గవర్నర్ కు పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. లేనట్టయితే గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించే అవకాశం లేదన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నదే చర్చనీయాంశంగా మారింది.