పర్మిట్ల రీ సైక్లింగ్ దందా… పర్యవేక్షణ కరువైందా..?
దిశ దశ, కరీంనగర్:
విదేశాలకు ఎగుమతి విషయంలోనే కాదు… స్థానికంగా కూడా అక్రమ వ్యాపారానికి తెర లేపినట్టుగా తెలుస్తోంది. కటింగ్, పాలిషింగ్ యూనిట్ల కేంద్రంగా కూడా సర్కారు రెవెన్యూకు తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
వే బిల్లుల రీ సైక్లింగ్ దందా…
కరీంనగర్ సమీపంలోని కొన్ని గ్రానైట్ పరిశ్రమల కేంద్రంగా సాగుతున్న పర్మిట్ల రీ సైక్లింగ్ దందా సాగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. క్వారీల నుండి రా మెటిరియల్ తరలించే విషయంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు అక్రమ వ్యాపారానికి తెరలేపినట్టుగా గ్రానైట్ వ్యాపార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలిషింగ్ యూనిట్ల సామర్థ్యాన్ని బట్టి 20 వరకు రా మెటిరియల్ బ్లాకులు కొనుగోలు చేస్తుంటారని అయితే అక్రమాలకు తెరలేపిన పరిశ్రమల యజమానులు వంద వరకు బ్లాకులు తరలించి పరిశ్రమల్లో స్టాక్ పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. క్వారీల నుండి ఒకటి అరా కొనుగోలు చేసినట్టుగా రికార్డులు మెయింటెన్ చేస్తూ చాలా వరకూ జీరో దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కటింగ్, పాలిషింగ్ చేసిన గ్రానైట్ ప్లేట్లను మార్కెట్ కు తరలించిన తరువాత వాటికి సంబంధించిన రా బ్లాకుల వే బిల్లులను కూడా చూపిస్తూ గనుల శాఖ ఆదాయానికి భారీగా గండి పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లాలో సాగుతున్న ఈ అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు చొరవ చూపే వారే లేకుండా పోయారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వేస్ట్ మెటిరియల్ పేరిట…
మరో వైపున క్వారీల్లో వృధాగా పడి ఉన్న వేస్ట్ మెటిరియల్ విషయంలో కూడా అక్రమాలకు తెరలేపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. బ్లాకులను కట్ చేసినప్పుడు మిగిలిపోయిన వృథా బండ రాళ్లు కూడా పాలిషింగ్ యూనిట్లకు తరలి వెల్తున్నాయి. అయితే వృథాగా పోతున్న ఈ మెటిరియల్ కు ఇచ్చే పర్మిట్ల విషయంలో చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వేస్ట్ మెటిరియల్ కు ఇచ్చే పర్మిట్ విషయంలోనే గనుల శాఖ అధికారులు సగం వరకే ఫీ వసూలు చేస్తుంటే ఒకే పర్మిట్ ద్వారా పలుమార్లు స్టాక్ తరలించుకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పరిశ్రమల నిర్వహాకులు లాబీయింగ్ చేస్తూ ఇలాంటి అక్రమాలకు తెరలేపడంతో గనుల శాఖకు వెల్లే అదనపు ఆదాయం దారి మల్లుతున్నట్టుగా తెలుస్తోంది.
నిఘా అవసరం…
వందల సంఖ్యలో ఏర్పాటయిన గ్రానైట్ పరిశ్రమలపై గనుల శాఖతో పాటు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్లాక్ లిస్టులో చేర్చిన క్వారీల్లో తవ్వకాలను కట్టడి చేసేందుకు టాస్క్ పెట్టిన జిల్లా యంత్రాంగం పరిశ్రమల మాటున సాగుతున్న దందాపై కూడా కొరడా ఝులిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అక్రమంగా సాగుతున్న ఈ దందా వళ్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడమే కాకుండా గనుల శాఖ నిబందనల ప్రకారం నడుపుతున్న పరిశ్రమల యజామానులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా నిజాయితీగా వ్యవహరిస్తున్న పరిశ్రమల నిర్వహాకులు ఎక్కువ ధరకు పాలిషింగ్ చేసిన గ్రానైట్ విక్రయిస్తుండగా, పర్మిట్ల రీ సైక్లింగ్, వేస్ట్ మెటిరియల్ జీరో దందాకు తెర లేపిన వారు తక్కువ ధరకు అమ్ముతున్నారు. దీంతో చాలా మంది తక్కువ ధరకు దొరుకుతున్న పరిశ్రమల వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అయితే ఆయా పరిశ్రమల్లో వినియోగిస్తున్న కరెంటుకు చెల్లిస్తున్న ఛార్జీలు, క్వారీల నుండి వెలికి తీస్తున్న బ్లాకుల వారిగా వివరాలు, గనుల శాఖ ఇస్తున్న పర్మిట్లు, కటింగ్, పాలిషింగ్ చేసిన గ్రానైట్ క్రయ విక్రయాల వివరాలను సేకరించినట్టయితే ఈ అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే జిల్లా అధికారయంత్రాంగం ఈ విషయంలో పకడ్బందీగా వ్యవహరించినట్టయితే సర్కారుకు పెద్ద ఎత్తున ఆదాయం రావడమే కాకుండా అక్రమాలకు కూడా తెరదించినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.