బీఆర్ఎస్ కార్పోరేటర్ల తర్జనభర్జన
దిశ దశ, కరీంనగర్:
మేయర్ సునీల్ రావు పార్టీ మారాడు… ఆయన చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టేందుకు రండి అంటూ బీఆర్ఎస్ నాయకత్వం నుండి పదే పదే కాల్స్ వస్తుండడంతో కార్పోరేటర్లు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతకాలం కరివేపాకుల్లా కనిపించిన తాము ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తున్నామంటూ గొణుక్కుంటున్నారు. మేయర్ సునీల్ రావు బీజేపీలో చేరుతున్నప్పటి నుండి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని, అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రావాలని పిలుస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
వారి చక్ర బంధంలో…
‘‘తీన్ పాపీ’’ చట్రంలో చిక్కుకుని అప్పుడు ముఖ్య నాయకులు ఇద్దరు కూడా తమను వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇతర కార్పోరేటర్లు. ద్రోహులమన్న రీతిలో నాయకునికి చెప్పగానే అతను ఇష్టారీతిన క్లాస్ పీకే వారని దీంతో తాము ఇంతకాలం అంటీముట్టకుండా వ్యవహరించాల్సి వచ్చిందని కూడా చర్చించికున్నట్టుగా తెలుస్తోంది. ప్రజా క్షేత్రంలో తమవంతు పాత్ర కూడా పోషించడం వల్లే ముఖ్య నాయకుడు గెలిచాడన్న విషయాన్ని విస్మరించి ‘‘ఆ ముగ్గురు’’ చెప్పినట్టుగా నడుచుకుని తమను బాధించిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని కూడా వాపోతున్నారు. అన్ని విషయాల్లోనూ వారికే ప్రయారిటీ ఇచ్చి తమను పట్టించుకోకపోవడమే కాకుండా నిందలు వేస్తున్నా పార్టీ ఉన్న అనుబంధాన్ని, సదరు నాయకునిపై ఉన్న మమకారాన్ని తెంచుకోలేకపోయామని కూడా కార్పోరేట్లు డిస్కషన్ చేసుకున్నట్టు సమాచారం. తమకు నాయకుని నుండి కాల్ వచ్చిందంటే చాలు ఏదో క్లాస్ ఇవ్వడానికేనన్న భయంతోనే ఉండేవారమని, కనీసం వివరణ కూడా ఇచ్చుకునే పరిస్థితి లేకుండా పోయేదని కొంతమంది కార్పోరేటర్లు చర్చ సందర్భంగా ఊంటంకించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నందున తమ అవసరం పడింది తప్ప ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించినట్టుగా లేదన్న సంకేతాలే కనిపిస్తున్నాయన్న వాదనలు కూడా వినిపించినట్టు సమాచారం. అంతా వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని వివక్షకు గురిచేయడం వల్ల తామే అన్ని విషయాల్లోనూ తీరని నష్టాలు చవి చూసి ఇప్పుడు నాయకుడు చెప్పినట్టుగా నడుచుకోవాలని అనడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇకనుండైనా తమకు ప్రాధాన్యత ఇస్తేనే బావుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో తమ నాయకుడు మారుతాడా లేదా అన్న అనుమానమే తమను వెంటాడుతోందని అంటున్న వారే ఎక్కువగా ఉండడం గమనార్హం.