రిసార్ట్స్… పార్టీలకు ఇప్పుడివి క్రేజీ అడ్డాలు అయ్యాయి… ఇప్పటివరకు హైదరాబాద్ శివార్లకే పరిమితం అయిన రిసార్ట్స్ కల్చర్ ఇప్పుడు జిల్లాలకు కూడా పాకింది. హైవేలు, పట్టణ శివారు ప్రాంతాల్లో కోకొల్లుగా నిర్మాణం అయిన ఈ రిసార్ట్స్, గెస్ట్ హౌజులు నిబంధనల మేరకు కొనసాగుతున్నాయా..? వీటిని బుక్ చేసుకుంటున్నది ఎవరూ..? అక్కడకు వచ్చి విందు వినోదాలు చేసుకునేందుకు పర్మిషన్ ఎవరిస్తున్నారు…? అన్న విషయాలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఔట్ స్కర్ట్స్ ప్రాంతంలో ఫామ్ హౌజ్ లు నిర్మించుకుని వీకెండ్స్ లో ఫ్యామిలీతో సరదాగా గడిపే సంస్కృతి నుండి అద్దెకు ఇచ్చి వ్యాపారం చేసే వరకు చేరుకున్నాయి.
నిబంధనల మేరకేనా..?
కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఈ రిసార్ట్స్ మందు పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. దీంతో బర్త్ డే అయినా, సంగీత్ అయినా, ఇతరాత్ర ఎలాంటి కార్యక్రమాలు అయినా రిసార్ట్స్ లో జరుపుకోవడం నయా ట్రెండ్ గా మారింది. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో నిర్మించిన ఈ రీసార్ట్స్ లీజుకు ఎవరికీ ఇస్తున్నారు? ఏ అవసరాల కోసం ఇస్తున్నారు? అద్దెకు తీసుకున్న వారి ఐడీ ప్రూఫ్స్ తీసుకుంటున్నారా? వీరు వ్యాపారం చేసేందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నారా అన్నది అధికారులకే తెలియాలి. జనావాసాల్లో హోటల్స్, లాడ్జిలలో గదులు అద్దెకు తీసుకుంటే ఆధార్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. శివార్లలో ఉన్న రిసార్ట్స్ గురించి మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోయారు. అంతేకాకుండా రిసార్ట్స్ లో మందు పార్టీలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఎక్సైజ్ విభాగానికి చలనా చెల్లించి ఆనుమతి తీసుకోవల్సి ఉంటుంది. కరీంనగర్ శివార్లలోని రిసార్ట్స్ ఈ విధానాన్ని ఎంతవరకు అమలుపరుస్తున్నాయో అన్నది నిర్వాహకులకే తెలియాలి.
మైనర్లకు ఎలా?
కరీంనగర్ శివారులోని ఓ రిసార్ట్స్ లో బర్త్ డే పార్టీ జరిగినట్టుగా తెలుస్తోంది. అదే రోజు ఇద్దరు మైనర్లు బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు వదిలారు. అయితే ఈ ఘటనలో మైనర్లకు వాహనం ఇచ్చారని పేరెంట్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా… మైనర్లు వెల్లిన రిసార్ట్స్ లో ఏం జరిగింది? మైనర్లు అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమోచ్చింది? రిసార్ట్ బుక్ చేసుకున్నది ఎవరూ అన్న వివరాలను సేకరిస్తే మరిన్ని వాస్తవాలు తెలిసేవి. దీనివల్ల ఇందుకు బాధ్యులైన వారందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కూడా శివారు ప్రాంతంలోని ఓ ఫార్మ్ హౌజ్ కేంద్రంగా జల్సాలు జరుగుతున్నాయని ప్రచారం కూడా జరిగింది. అక్కడకు అప్పుడు కరీంనగర్ లో పని చేస్తున్న పోలీసు అధికారులు కూడా వెల్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా రిసార్ట్స్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడంతో ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి వాటికి అద్దెకు ఇస్తామని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అయా రిసార్ట్స్ పై పోలీసుల దృష్టి అంతగా ఉండదని గుర్తించిన కొందరు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకునే అవకాశం లేకపోలేదు.