దిశ దశ, హైదరాబాద్:
ఎస్ఐబీ హార్డ్ డిస్కులు కొన్ని మూసీ నది పాలు కూడా అయినట్టుగా పోలీసుల విచారణలో తేలినట్టుగా సమాచారం. నాగోల్ సమీపంలోని మూసీ వంతెన కింద కొన్ని హార్డు డిస్కులను పడవేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. మూసీ నది వంతెన సమీపంలో పోలీసులు హార్డు డిస్కుల కోసం వేట కొనసాగించిన కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ప్రభాకర్ రావు ఇంట్లో…
శుక్రవారం రాత్రి నుండి సోదాలు నిర్వహించిన దర్యాప్తు బృందాలు ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ ఇంట్లో కూడా సోదాలు చేపట్టాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందాలు ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు చేపట్టినట్టుగా విశ్వసనీయ సమాచారం. మరో వైపున ఇంటలీజెన్స్ టాప్ సీక్రెట్ వింగ్ లో పనిచేసిన భుజంగరావు, ఎస్ఐబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేసిన తిరుపతన్నల ఇండ్లలోనూ సోదాలు జరిపినట్టు సమాచారం. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 10 పోలీసు బృందాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగించినట్టు సమాచారం. మరో వైపున తిరుపతన్నను విచారణకు రావాలని ఆదేశించడంతో ఆయన కొద్ది సేపటి క్రితం బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు చేస్తున్న అధికారుల తిరుపతన్నను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
శ్రవణ్ ఇంట్లో…
శుక్రవారం రాత్రి ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్ రావు ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు రాత్రి 12 గంటల ఆ తరువాత ఆయన ఇంట్లోకి వెళ్లగలిగారు. దాదాపు మూడు గంటల వరకు శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసు అధికారులు 2 ల్యాప్ ట్యాపులు, 4 ట్యాబులు, ఐదు పెన్ డ్రైవ్ లు, ఒక హార్డ్ డిస్కును స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మాదాపూర్ లోని ఛానెల్ ఎండీ ఆఫీసులో డిజిటల్ వీడియో రికార్డర్ (ఢీవీఆర్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛానెల్ ఎండీని తరుచూ వరంగల్, ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు కలిసేందుకు వెళ్లేవారని పోలీసులు గుర్తించారు. ఈ ఆఫీసు కేంద్రంగా సాగిన వ్యవహారాపై ఆరా తీసే పనిలో కూడా నిమగ్నమైనట్టుగా సమాచారం. మరో వైపున శ్రవణ్ రావు, డీఎస్పీ ప్రణిత్ రావు ఛాటింగ్ ఆధారం చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.