దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ నడి బొడ్డున అసలేం జరుగుతోంది..? ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్న తీరు దేనికి సంకేతం..? నగరంలోని సూర్యనగర్ రోడ్ నంబర్ 7కు అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 10ఏళ్లకు పైగా ఈ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నామని ఇప్పుడు ఆ భూమి తమదేనని కొంతమంది రోడ్డుపై గోడ నిర్మించడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు అంటున్నారు. పట్టాదారులకు సంబంధించిన భూమి కాబట్టే గోడ నిర్మించుకున్నారన్న వాదనలు తెరపైకి వస్తున్నప్పటికీ ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికుల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోందని ప్రత్యేకంగా సీసీ రోడ్డు వేసినప్పుడు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదని కాలనీ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆ భూమి తమదని అడ్డంగా గోడ నిర్మించడం సరికాదని, మునిసిపల్ అధికారులకు రోడ్డు వేసినప్పుడే ఫిర్యాదు చేసినట్టయితే ప్రత్యామ్నాయ మార్గం చూసే వారని సూర్యనగర్ రోడ్ నంబర్ 7 కాలనీ వాసులు అంటన్నారు. దాదాపు మూడేళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డును బ్లాక్ చేసిన విషయంపై బల్దియా అధికారులు చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని అంటున్నారు స్థానికులు.
ప్లానింగ్ లేకుండానే…
తాజాగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించుకుని భూమి యజమాని ఇది తన స్థలం అని చెప్తున్నారంటే కాలనీ ఏర్పాటు సమయంలో మునిసిపల్ అధికారులు పట్టించుకున్నారా లేదా అన్న చర్చ సాగుతోంది. కాలనీలో ఇండ్ల నిర్మాణం జరుపుతున్నప్పుడు ప్రధాన రోడ్లు, కాలనీ రోడ్లు ఎంత వెడల్పులో ఉండాలి అన్న నిబంధనలు పాటించలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ఇక్కడ ఇంటి నిర్మాణాలు జరుపుకుంటున్న వారు అనుమతుల కోసం మునిసిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నప్పుడు రోడ్ల విషయాన్ని పట్టించుకోకుండానే అనుమతులు ఇచ్చారా..? ఇందుకు సంబంధించిన సిబ్బంది ఎలా సర్టిఫై చేశారన్నదే అంతు చిక్కకుండా పోతోంది. 7వ నంబర్ రోడ్డుపై గోడ నిర్మాణం చేసిన యజమానిదే భూమి అయితే మునిసిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ కు సంబంధం లేకుండా రోడ్ల నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారంటూ స్థానికులు అడుగుతున్నారు. కాలనీల ఆవిర్భవ సమయంలోనే రోడ్ల కోసం వదిలేసిన స్థలాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంటారు. అయితే మూడేళ్ల క్రితం నిర్మించిన సిమెంటు రోడ్డుపై ఇప్పుడు గోడ నిర్మించారంటే మునిసిపల్ అధికారులే నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఇంతకాలం తెరమీదకు రాని ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్న విషయంపై కూడా స్థానికంగా చర్చ సాగుతోంది. కాలనీకి సంబంధించిన మ్యాపు ఆధారంగా అయినా తమకు రోడ్డు వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకాలం ఈ రహధారి స్థలం తమదేనని యజమాని అభ్యంతరం వ్యక్తం చేసినట్టయితే తాము ప్రత్యామ్నాయ రోడ్డు కోసం మునిసిపాలిటీలో దరఖాస్తు చేసుకునే వారమని అప్పుడ అధికారులు తమకు రోడ్డు కోసం స్థలాన్ని కెటాయించే అవకాశం ఉండేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ రోడ్డు తమదని యజమాని రోడ్డు నిర్మించడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అంటున్నారు. బల్దియా అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.