వివాహం జరగాల్సిన ఇంట విషాదం…

రెండు రోజుల్లో అక్క పెల్లి…

అర్థరాత్రి తమ్ముడు మృతి…

దిశ దశ, కరీంనగర్:

అక్కయ్య పెళ్లి కావడంతో ఆ తమ్ముడి ఆనందానికి అవధులు లేవు. అట్ట హాసంగా ఏర్పాటు చేసిన సంగీత్ ప్రోగ్రామ్ లో సంబరంగా డ్యాన్స్ చేశాడు. అలా వేదిక దిగి కూర్చిలో కుర్చున్న ఆ యువకుడు అలాగే కుప్పకూలిపోయాడు. అనారోగ్య సమస్యలు లేవు… కరోనా బారిన పడలేదు అయినా ఆ యువకుడు కానరానిలోకాలకు చేరిపోయాడు. దీంతో అప్పటివరకు సంతోషంలో మునిగితేలిన ఆకుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కరీంనగర్ జ్యోతినగర్ కు చెందిన రాజేశ్వర్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తున్నారు. తన కూతురుకు ఈ నెల 29న వివాహం నిశ్చయం కావడంతో వేడుక ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. పెళ్లి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి సంగీత్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజేశ్వర్ బంధువులతో పాటు స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్థరాత్రి వరకు సంగీత్ కార్యక్రమంలో భాగంగా కుటుంబమంతా సంబరాల్లో మునిగిపోయింది. సంగీత్ లో భాగంగా రాజేశ్వర్ కొడుకు శివ తేజ కాముని సంతోషంగా డ్యాన్స్ చేసి అందరిని అలరించాడు. సంగీత్ ప్రోగ్రామ్ లో అతని కుటుంబమంతా జోష్ లో ఉన్న క్రమంలో శివ తేజ వేదిక కిందకు చేరుకున్న కొద్ది సేపటికే తుది శ్వాస విడిచాడు. దీంతో సంగీత్ కార్యక్రమం అంతా ఒక్కసారిగా మూగబోయింది. శివ తేజ మరణంతో అప్పటివరకు సంతోషంతో ఉన్న ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. అప్పటి వరకు ఆడిపాడిన తమ బిడ్డ అచేతనావస్థలో పడిపోవడాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు, పెళ్లి కూతురు కన్నీటి పర్యంతం అయ్యారు.  ఆరోగ్యంగా ఉన్న శివతేజ ఉన్నట్టుండి విగతజీవిగా మారిపోయిన తీరు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కరోనా సోకిన వారే ఎక్కువగా చనిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ శివ తేజ కరోనా బారిన కూడా పడలేదని ఆరోగ్యంగా ఉన్న ఆ బిడ్డ అసువుల బాయడం జ్యోతినగర్ వాసులను విషాదంలోకి నెట్టివేసింది. బీటెక్ సివిల్ కంప్లీట్ చేసిన శివతేజకు ఉజ్వల భవిష్యత్తు ఉందని కలలుకన్నప్పటికీ అతన్ని కబళించిన మృత్యువు ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

You cannot copy content of this page