స్వయం కృతాపరాధమా… చక్రబంధంలో చిక్కుకున్నారా..?

పెద్దపల్లి అధికార పార్టీ అభ్యర్థి పరిస్థితి…

దిశ దశ, పెద్దపల్లి:

అప్రతిహతంగా గెలుపు బాటలో నడుస్తున్న ఆయన ఇప్పుడు విజయాన్ని అందుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటిని చక్కబెట్టుకోవడంలో విఫలం అయ్యారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఎన్నో వ్యతిరేకతల ఫలితమే ఆ అభ్యర్థి వైఫల్యానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎందుకిలా..?

పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్దిగాంచిన విద్యా సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయిన ఆయన రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోందని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఆయన పొలిటికల్ మేనేజ్ మెంట్ స్కిల్స్ విషయంలో విఫలం అయ్యారా అన్న చర్చ మొదలైంది. గత ఎన్నికల్లోనే చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా పోలింగ్ సమీపించగానే అప్రమత్తం అయి తేరుకున్నారు. అప్పుడు అధినేత కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ కూడా కలిసి రావడం వల్ల ఆయన విజయాన్ని ముద్దాడారు. కానీ ఇప్పుడా పరిస్థితులు లేకపోవడంతో ఆయనకు ప్రజా క్షేత్రంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది సెకండ్ క్యాడర్ లీడర్ల చక్ర బంధంలో చిక్కుకున్న దాసరి మిగతా వారిని విస్మరించారన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్న వారిని అక్కున చేర్చుకుని మిగతా వారిని విస్మరించడమే ఆయనకు తీరని నష్టాన్ని చవిచూపిస్తోందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పాలిటిక్స్ తో సంబంధం లేకుండా.. ఇతరరే ప్రొఫెషనల్స్ లో స్థిరపడిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అధికార యంత్రాంగం బదిలీల ప్రక్రియలోనూ వారి నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఇబ్బందిగా తయారైంది.

రీచుల ప్రభావమూ…

ఇకపోతే జిల్లాను ఆనుకుని ప్రవహిస్తున్న ఇసుక రీచుల ఏర్పాటు కూడా ఆయనకు సవాళ్లు విసురుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మానేరు తీరం నుండి ఇసుక తరలించేందుకు ఏర్పాటు చేసిన రీచుల విషయంలో ఆయన కఠినంగా వ్యవహరించకపోవడం వల్ల కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలాల ప్రజలు నిత్యం నరకాన్ని చవి చూస్తున్నారు. రహదారులు అస్తవ్యస్తంగా మారిపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా మారినా ఆయన తమ బాగును విస్మరించారన్న ఆవేదన అక్కడి ప్రజల్లో వ్యక్తం అవుతోంది. దీంతో ఆ రెండు మండలాల్లో కూడా దాసరి మనోహర్ రెడ్డిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరో వైపున ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద రావుతో సఖ్యత లేకపోవడం… ఆయన అనుచర గణం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం కూడా మరో మైనస్ అనే చెప్పవచ్చు.

బీసీ బిడ్డ ఎఫెక్ట్…

ఓ వైపున చిరకాల ప్రత్యర్థి విజయ రమణారావుపై ఉన్న సానుభూతి ఒక ఎత్తైతే… మరో వైపున సిట్టింగ్ ఎమ్మెల్యేపై వచ్చిన వ్యతిరేకత మరో ఎత్తుగా మారిపోయింది పెద్దపల్లిలో. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్నట్టుగా మరో రూపంలో దాసరి ఓటు బ్యాంకుకు తీవ్రమైన నష్టం కల్గిస్తున్నారు బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష, ఉన్నత చదువులు చదవిన బీసీ బిడ్డ అయిన ఉష తొలి ప్రయత్నంలోనే పెద్దపల్లి ప్రజలతో మమేకం కాగా, బహుజన వాదాన్ని బలంగా వినిపించే బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీల్లోని అసమ్మతి వాదులను తనకు అస్మదీయులుగా మల్చుకోవడంలో కూడా దాసరి ఉష సక్సెస్ అయ్యారు. కొంత కాలంగా పెద్దపల్లి ప్రజలతో మమేకమై తిరుగుతున్న ఉషా టఫ్ పైట్ ఇచ్చే స్థాయికి ఎదగడం కూడా ఆయనకు సవాల్ గా మారింది. తాజాగా నిఘా వర్గాలు కూడా పెద్దపల్లిపై సేకరించిన వివరాలను బట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రాఫ్ క్రమక్రమంగా పడిపోతున్నట్టుగా గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలతో కూడిన నివేదికలు తెప్పించుకుంటున్న అధినేత కేసీఆర్ కూడా దాసరి మనోహర్ రెడ్డికి దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

You cannot copy content of this page