నోటీసులపై కౌంటర్ అటాక్ చేస్తున్న జూనియర్ కార్యదర్శులు
దిశ దశ, కరీంనగర్:
మా ఇంటికి నోటీసులు అంటించి పరువు తీసే పని చేస్తా ప్రాణాలు తీసుకుంటాం… మా కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటామంటూ లేఖ రాసి ఇస్తే నోటీసులు రిసీవ్ చేసుకుంటామని ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన సమాధానం సంచలనంగా మారింది. ఉద్యోగాలు తొలగిస్తామని నోటీసులు ఇస్తున్నారంటే తామేం తప్పు చేయనందున ఇజ్జత్ తీసినట్టేనని తాము భావిస్తున్నామంటూ ఆయన వెల్లడించడం కలకలం సృష్టిస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఆడియో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. సమ్మె శిబిరంలో ఉన్న జూనియర్ కార్యదర్శికి సంబంధిత మండల అధికారి ఫోన్ చేసి నోటీసులు సర్వ్ చేసే విషయం చెప్పడంతో ఆయన స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తామంతా శిబిరంలోనే ఉన్నామని ఇక్కడకు వచ్చి నోటీసులు ఇస్తే ప్రాణాలు తీసుకుంటామంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమను రెగ్యూలర్ చేయాలన్న డిమాండ్ తో నిరసనలు చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు తొలగిస్తామంటూ నోటీసులు ఇవ్వడంతో పాటు జూనియర్ కార్యదర్శుల ఇండ్లకు నోటీసులు కూడా అంటిస్తున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న కార్యదర్శులు అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. నోటీసులు తీసుకోకుండా ప్రాణాలు తీసుకుంటామని చెప్తున్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని కూడా సదరు జూనియర్ కార్యదర్శి అధికారికి సూచించడం గమనార్హం. ఉద్యోగాలు తొలగిస్తూ ఇచ్చే ఆదేశాలకు కూడా భయపడకుండా సమ్మెలోనే కొనసాగాలని కార్యదర్శులు నిర్ణయించిన నేపథ్యంలో అధికారికి ఇఛ్చిన ఈ సమాధానం హాట్ టాపిక్ గా మారింది.