బ్రహ్మస్త్రాలుగా మారిన పిచ్చుకలు: తెలంగాణ ఎన్నికల్లో అనూహ్య విజయాలు

దిశ దశ, హైదరాబాద్:

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయడమేంటని అనుకుంటుంటాం… కానీ ఆ పిచ్చుకలు కూడా బ్రహ్మస్త్రంగా మారిపోతాయన్న నానుడి మాత్రం ఎక్కడా విని ఉండరు. కానీ తెలంగాణ ఎన్నికల్లో ఇది సాధ్యమేనని నిరూపించారు కొందరు. కామారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన బీజేపీ అభ్యర్థిని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను మట్టి కరిపించి రికార్డ్ సృష్టించారు. ఏక కాలంలో ఇద్దరు ప్రముఖులను ఓఢించి జాయింట్ కిల్లర్ గా మారిపోయారు. కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. కామారెడ్డి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తానాని ప్రకటించిన తరువాత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వీరిద్దరు ఓకే చోటి నుండి పోటీ చేస్తుండడం సంచలనంగా మారింది. సీఎం కేసీఆర్ తొలి రౌండ్ నుండి ఇక్కడ మూడో స్థానానికే పరిమితం కాగా కొన్ని రౌండ్ల వరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యత కనబర్చారు. చివరకు వెంకటరమణారెడ్డి గెలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కల్వకుర్తి నుండి టీడీపీ అధినేత ఎన్టీరామారావు పోటీ చేయగా ఆయనపై చిత్తరంజన్ దాస్ విజయం సాధించిన రికార్డు తెలంగాణకే సొంతం. తాజాగా జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థులపై విజయం సాధించడంతో కొత్త చరిత్ర సృష్టించినట్టయింది.

తొలి ప్రయత్నంలోనే…

మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఓటమి చవి చూడని నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి నుండి ఆయన మరోసారి గెలుస్తానన్న కలలను చెదరగొట్టాయి ఈ ఎన్నికలు. ఆయనపై ఎన్నారై ఝాన్సీ రెడ్డి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆమె పౌరసత్వం బూచి కారణంగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఝాన్సీ రెడ్డి బరిలో నిలవకుండా ఉండేందుకు మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి పావులు కదిపారన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో పాలకుర్తిలో తన సత్తా ఏంటో చాటాలనుకున్న ఝాన్సి రెడ్డి తన కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి కూడా ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. అధికార బలంతో ఉన్న ఎర్రబెల్లిపై యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నప్పటికీ ఆమె గెలుపు అంత సునాయసం కాదని విశ్లేషకులు అంచనా వేశారు. అయినప్పటికీ ఆమె మాత్రం పట్టుదలతో ప్రజా క్షేత్రంలోకి వెల్లి పాలకుర్తి ఓటర్లను ఆకట్టుకుని విజయం సాధించారు. రాజకీయ దురంధురుడిగా పేరుగాంచిన ఎర్రబెల్లి దయాకర్ రావును తొలి ప్రయత్నంలోనే ఓడించి సంచలనం సృష్టించారు యశస్విని రెడ్డి. ఆయన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని యశస్విని గెలవడం విశేషం.

మెదక్ లో…

మెదక్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డిపై గెలిచారు. రోహిత్ టికెట్ విషయంలోనే ఆయన తండ్రి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీ అదిష్టానంతో విబేధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కుటంబానికి రాజకీయ శత్రువుగా మారిన పద్మా దేవేందర్ రెడ్డిపై రోహిత్ గెలవడం అందరినీ ఆశ్యర్యపర్చింది. పద్మా దేవేందర్ రెడ్డి ఓ సారి మైనంపల్లి హన్మంతరావుపై ఆయన భార్యపై, తనయుడిపై పోటీ చేసిన చరిత్ర దక్కించుకున్నారు.

You cannot copy content of this page