దిశ దశ, కాళేశ్వరం:
అభిషేక ప్రియుడైన శివయ్య సన్నిధిలో కుంబాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దివ్యమైన ముహుర్తంలో కుంబాభిషేక కార్యక్రమానికి అంకురార్పణ చేశారు వేద పండితులు. అచలాపూరం రుత్వికులతో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత అరుదైన ఘట్టానికి శ్రీకారం జరిగింది. త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరంలో ప్రారంభం అయిన శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంబాభిషేక మహోత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. స్వస్తి వచనము, గో పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, రుత్విక్ వర్ణనము, రక్షా బంధనం, పంచగవ్య ప్రాశనము, అఖడ జ్యోతి ప్రజ్వలన, యాగ శాల ప్రవేశం, నవగ్రహ వాస్తు, యోగిని, క్షేత్ర పాలక, చతుర్లింగతో భద్ర, సర్వతో భద్ర, మండప దేవతా స్థాపన పూజలు, హోమాలు, చండీ పారాయణం కార్యక్రమాలను నిర్వహించారు వేద పండితులు. ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించాల్సిన కుంబాభిషేకం కార్యక్రమం కాళేశ్వర క్షేత్రంలో 42 ఏళ్లకు నోచుకుంది. దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. త్రివేణి, త్రిలింగ, త్రిదైవ క్షేత్రం కూడా అయిన కాళేశ్వరం ఎంతో చారిత్రాత్మకతను సంతరించుకున్న ఆలయం. ప్రపంచంలోనే నాలుగు దిక్కులా మూల విరాట్టులను దర్శించుకునే క్షేత్రాలలో కాళేశ్వరం ఒకటి కాగా, దేశంలో అరుదైన మూడు సరస్వతి ఆలయాల్లో ఒకటి ఇక్కడ వెలిసింది. అలాగే ప్రత్యేకత సంతరించుకున్న మూడు సూర్యాలయాల్లో ఒకటి కాళేశ్వరంలో ఉండడం మరో విశేషం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం గురించి చరిత్ర పుటల్లో పదిలంగా ఉన్నా, బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువేనని చెప్పాలి. దీంతో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రం ప్రాచూర్యంలోకి రాకుండా పోయింది. దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలుగా వెలుగొందుతున్న ఆలయాలతో సరిసమానమైన కాళేశ్వరం కుంబాభిషేక మహోత్సవ కార్యక్రమంతో అయినా గుర్తింపు లభించే అవకాశం ఉంటుందని స్థానికులు ఆశిస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో గుట్టల్లో వెలిసిన శ్రీశైలం ఆలయం అభ్యున్నతిపై చూపించినప్పటికీ అదే క్షేత్రంతో అనుసంధానంగా ఉండే ఆలయాల్లో ఒకటైన కాళేశ్వరం విషయంలో మాత్రం వివక్ష చూపారు. ఇటీవల కాలంనుండే కాళేశ్వరం అభ్యున్నతి వైపు అడుగులు వేస్తుండగా, ఆలయ విశిష్టత కూడా వెలుగులోకి వస్తున్నది. కుంబాభిషేక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు సాగే విధంగా కార్యాచరణ రూపొందించామని ఆలయ ఈఓ మహేష్ మీడియాకు తెలిపారు.
దక్షిణాదికే…
ఉత్తర భారతాన ప్రయాగ్ రాజ్ తరువాత త్రివేణి సంగమంగా భాసిల్లుతున్నది కూడా ఇక్కడే. దక్షిణాది రాష్ట్రాల్లోనే మూడు నదులు కలుస్తున్న కాళేశ్వరంలో వచ్చే మే నెలలో సరస్వతి పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దేవాదాయ శాఖ అధికారులు.