భస్మాసుర హస్తం అంటే ఇదేనా..? అదే చట్టం కోరలు చాస్తోందా..?

దిశ దశ, కరీంనగర్:

అంతా మా చేతిలోనే సాగుతోంది… మేమేం చేసినా చెల్లుతుంది… అన్న రీతిలో వ్యవహరించిన తీరే నేడు వెంటాడుతోంది అక్రమార్కులను. తమపై ఫిర్యాదు వస్తే స్టేషన్ మెయిన్ గేటు కూడా దాటి లోపలకు రానివ్వద్దన్న రీతిలో వ్యవహరించిన వారిప్పుడు పరార్ కావల్సిన  దుస్థితి రావడానికి కారణం ఏంటీ..? భస్మాసుర హస్తాన్ని మరిపించిన విధంగా అయింది కొంతమంది పరిస్థితి. నాడు అంగబలం… అధికారం…పలుకుబడి ఉపయోగించుకుని తమపై వచ్చిన ఫిర్యాదులనే పట్టించుకోకుండా వ్యవహరించిన వారంతా నేడు చట్టానికి చిక్కకుండా తప్పించుకోవడం ఎలా అన్న ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. అప్పుడు అక్రమాల తంతుకు తెరలేపిన ప్రబుద్దులు నేడు బ్రతుకుజీవుడా అనుకునే పరిస్థితి వస్తుందా రాదా అన్న టెన్షన్ లో కొట్టుమిట్టాడుతున్నారు.

పరారీలో ఎందరో..?

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి అక్రమార్కులపై కొరడా ఝులిపించడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. నాలుగో సింహం నిద్ర లేచిందన్నట్టుగా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసిన సీపీ అక్రమ భాగోతాలతో కాలం వెల్లదీసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. దీంతో బాధితులు కూడా వందల సంఖ్యలో సీపీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. బాధితుల గోడు వింటున్న సీపీ ఏ కేసులో ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, పిర్యాదుకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. సీపీ సీరియస్ గా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు తమపై ఎవరు ఫిర్యాదు చేస్తారో..? ఎప్పుడు పోలీసులు తమను పట్టుకెల్తారోనన్న భయంతో తప్పించుకుని తిరుగుతున్నారన్న ప్రచారం కరీంనగర్ లో ఊపందుకుంది. వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల పరంపరను గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసలు శాంతి భధ్రతలను కాపాడేందుకు చొరవ తీసుకున్నారా లేదా అన్న అనుమానం కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ స్థాయికి కరీంనగర్ పోలీసింగ్ దిగజారి పోయిందా అన్న ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.

భస్మాసుర హస్తం అంటే ఇదే…

అయితే తననెత్తిమీద తాను చేయిపెట్టుకోగానే భస్మాసురుడు భస్మం అయిపోయినట్టుగా మారింది కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని అక్రమార్కుల పరిస్థితి. అప్పుడు బలం, బలగం అంతా తమ చేతుల్లో ఉందన్న ధీమాతో వ్యవహరించి కనీసం జీడీలో కూడా తమపై వచ్చిన ఫిర్యాదును రికార్డు చేయకుండా ఒత్తిడి తీసుకొచ్చారన్న ప్రచారం ఉంది. పొలిటికల్ పోస్టింగులకే ప్రాధాన్యత ఇవ్వడంతో అప్పటి పోలీసు అధికారులు కూడా అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా మారిపోయి ఎఫ్ఐఆర్ జారీ చేసేందుకు కూడా సాహసించలేదు. దీంతో అక్రమాలకు పాల్పడిన ప్రముఖులంతా దర్జాతనం వెలగబెట్టి తమ దర్పాన్ని ప్రదర్శించారు ఇంతకాలం. తాజాగా ప్రభుత్వం మారడం అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలన్న సంకేతాలు ఇవ్వడానికి తోడు చట్టం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే అభిషేక్ మహంతి సీపీగా రావడంతో కరీంనగర్ అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. అయితే తమ పెత్తనం నడుస్తున్నప్పుడే బాధితులు స్టేషన్లకు వెల్లి ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ చేయించి సదరు కేసులో బెయిల్ పై రావడమో లేక, సీఆర్పీసీ 41 కింద నోటీసులు అందుకోవడమో అయితే ఇప్పుడీ పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ అప్పుడు సామాన్యుడు ఠాణా మెట్లక్కకుండా చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడంతో ఇప్పుడు అదే చట్టం వారిని వెంటాడుతూ కేసులు నమోదు అయ్యేలా చేస్తోంది. అప్పుడు కేసులు బుక్ చేసుకున్నా ఇప్పుడు కోర్టులో కేసు విచారణ ఉందన్న కారణంతో తప్పించుకునే అవకాశం అక్రమార్కులకు ఉండేది. కానీ ఇప్పుడే అదే చాలామంది అక్రమార్కుల పాలిట శాపంగా మారిపోయింది. బాధితులు క్యూ కడుతుంటే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఒక్కొక్కరిని కటకటాల వెనక్కి పంపించే పనిలో నిమగ్నం అయ్యారు.

You cannot copy content of this page