ఒక రోడ్డు… ముగ్గురు ఎంపీలు…

దిశ దశ, కరీంనగర్:

ఒక రోడ్డు… ముగ్గురు ఎంపీలు… మూడు టర్మ్ లు… నిధుల కెటాయింపు చుట్టూ సాగుతున్న ప్రకటనల వెల్లువ. ఇది వరంగల్, కరీంనగర్ జగిత్యాల రహదారి పరిస్థితి. ఈ రోడ్డు తమ హయాంలో సాంక్షన్ అయిందంటే కాదు కాదు తమ హయాంలో అయిందని లేదు నా హయాంలోనే అయిందని ఇలా ముగ్గురు కూడా పోటాపోటిగా ప్రచారం చేసుకుంటున్నారు. 563 హైవే నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది తమ ప్రతిపాదనల వల్లేనని చెప్తు మీడియా ముందుకు వస్తున్నారు.

హైవే క్రెడిట్ నాదే: పొన్నం

2014కు ముందే వరంగల్, కరీంనగర్, జగిత్యాల హైవే ను తాను రోడ్డు మంజూరు చేయించానని కేంద్ర ప్రభుత్వం నుండి లేఖ ఉందని, ఆ నాడు మిషన్ భగీరథ పైపులు ఉన్నాయన్న కారణంతో నిర్మాణం జరపలేదని మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ చెప్తున్నారు. ఈ హైవేను దారి మళ్లించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, జగిత్యాల నుండి వరంగల్ వెల్లే వారు రాయపట్నం, రామగుండం రోడ్డు మీదుగా చెంజర్లకు వెళ్లాల్సిన అవసరం ఉందా.. అన్న విషయాన్ని ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అలైన్ మెంట్ మార్పు ప్రతిమ మెడికల్ కాలేజీ కోసం జరిగిందని, ఈ విషయంపై సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ని కలిసి పున: సమీక్షించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరినా పట్టించుకోలేదన్నారు. ఈ రోడ్డు ఆలస్యానికి కారణం వినోద్ కుమార్, సంజయ్ లేనని పొన్నం దుయ్యబట్టారు. అదే సమయంలో మంజూరైన నాందేడ్ రోడ్డు ఇప్పటికే ప్రారంభం అయితే వరంగల్, జగిత్యాల రోడ్డు మాత్రం నేటికి నిర్మాణానికి నోచుకోలేదని పొన్నం ప్రభాకర్ మండి పడ్డారు.

జిల్లాతో హైవేలకు అప్ లింక్ చేశా: బోయినపల్లి

కరీంనగర్ మీుదుగా ఇంతకాలం హైవే రోడ్డన్న ఊసే లేదని, తాను ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్ కు నేషనల్ హైవేలతో అనుసంధానం చేసిన ఘనత తనదేనని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హైవేల నిర్మాణం తీరు తెన్నులను పర్యవేక్షించేందుకు ప్రత్యకంగా కరీంనగర్ లో నేషనల్ హైవే అథారిటీ కార్యాలయం ఏర్పాటు చేయిస్తే దారిని తరలించారని ఆరోపించారు. తాజాగా వరంగల్, కరీంనగర్, జగిత్యాల హైవే 2016లోనే మంజూరు అయిందని, ఇది తన కృషి వల్లే అయిందని బోయినపల్లి పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇటీవల కరీంనగర్ మేయర్ సునీల్ రావు కూడా ఈ రోడ్డు మంజూరు ఘనత వినోద్ కుమార్ కే దక్కుతుందని వ్యాఖ్యానించారు.

నా కృషి వల్లే: బండి సంజయ్

ఈ హైవే నిర్మాణం కోసం పలుమార్లు ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసి అభ్యర్థించడం వల్లే నిధులు మంజూరు అయ్యాయని, ఇందు కోసం రూ. 2,146 కోట్ల నిధులు కేంద్రం మంజూరు చేసిందని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత శాఖ అధికారులను కూడా పలుమార్లు కలిసి అభ్యర్థించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం ఎదురైన సాంకేతిక ఇబ్బందులను అధిగమించడంతో పాటు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడంలో కూడా ప్రత్యేక దృష్టి సారించానని ఆయన ప్రకటించారు. ఎంపీ బండి సంజయ్ ఢిల్లీలో పదే పదే అధికారులను, కేంద్ర మంత్రులను కలిసి నిధులు మంజూరు చేయించడంలో సక్సెస్ అయ్యారని కరీంనగర్ లోకసభ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ అంటున్నారు.

ఈ రోడ్డు నిర్మాణం కోసం శనివారం వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్తాపన చేయడంతో కరీంనగర్ నుండి ప్రాతినిథ్యం వహించిన ముగ్గురు ఎంపీలు కూడా ఈ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు రంగంలోకి దిగారు. నిర్మాణ పనులు త్వరలో స్టార్ట్ కానున్న నేపథ్యంలో తమ కృషివల్లే రోడ్డు మంజూరైందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రోడ్డు సాంక్షన్ అంశం తమ పార్టీ అకౌంట్లో పడాలని మూడు పార్టీల నాయకులు తాపత్రయపడుతున్నారు. ఏది ఏమైనా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఈ నేషనల్ హైవే చుట్టే ప్రకటనలు చేస్తూ ప్రజల్లో పట్టు నిలుపుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది.

You cannot copy content of this page