దిశ దశ, ఖమ్మం:
ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని విధి వంచించింది. సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో అనారోగ్యం విషాదాన్ని నింపింది. భార్య తిరిగిరాని లోకాలకు చేరడంతో తల్లడిల్లిపోయిన భర్త ఆమె తన కళ్లముందు ఉండాలని భావించాడు. ప్రేమతో నాడు తన చేతిలో చేయి కలిపి జీవిత భాగస్వామి అయిన ఆలి జ్ఞాపకాలు మదిలోనే కాదు ఇంటిలోనూ ఉండాలని భావించాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజరకు చెందిన అశోక్, పద్మ శ్రీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006లో వివాహం చేసుకున్న అశోక్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సత్తుపల్లిలో స్థిరపడ్డారు. పద్మశ్రీ కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా విజయవాడకు తీసుకెళ్లి చికిత్స అందించారు. పద్మశ్రీ అనారోగ్యంతో మృత్యువాత పడడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. 18 ఏళ్ల పాటు తనతో జీవితాన్ని పంచుకున్న పద్మశ్రీని మరిచిపోలేకపోతున్న అశోక్ హ్యాండ్ కాస్టింగ్ చేయించాలని నిర్ణయించాడు. విజయవాడ నుండి ప్రత్యేకంగా కాస్టింగ్ చేసే వారిని పిలిపించాడు. అంత్యక్రియల సమయంలో అశోక్, తన కూతురితో పటు భార్య చేతులను కలిపి హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించాడు.