మరణించిందనుకున్న తల్లి… యూట్యూబ్ ఛానెల్ లో కనిపించి…

సంభ్రామశ్యర్యంలో కుటుంబ సభ్యులు…

దిశ దశ, ఖమ్మం:

కరోనా కష్ట కాలంలో మతిస్థిమితం లేక తప్పిపోయిన తల్లి… అంతలోనే గ్రామ శివార్లలోని ఓ గుట్టపై గుర్తు తెలియని మహిళ శవాన్ని అగంతకులు కాల్చివేశారన్న సమాచారం. దీంతో ఆ కొండపై చనిపోయింది తమ తల్లేనని భావించిన ఆమె తనయులు కర్మకాండలు కూడా జరిపించారు. రెండున్నరేళ్లుగా తిరిగిరాని లోకాలకు చేరుకుందని భావించి జీవనం సాగిస్తున్న వారికి అకస్మాత్తుగా ఓ యూ ట్యూబ్ ఛానెల్ లో తల్లి కనిపించింది. మొదట కొంతసేపు అనుమానంతో ఊగిసలాడినా కుటుంబ సభ్యులంతా మళ్లీ మళ్లీ ఆ న్యూస్ ను పరికించి చూడడంతో ఆమె తమ తల్లేనని కన్ ఫం చేసుకుని… ఆమె కోసం ఆరా తీశారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ఆర్కే ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలో శుక్రవారం ఈ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

అసలేం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మ, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మతిస్థిమితం లేని నాగేంద్రమ్మ రెండున్నర సంవత్సరాల క్రింతం ఇంటి నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులంతా ఆమె కోసం ఆరా తీసినప్పటికీ ఆచూకి మాత్రం దొరకలేదు. ఈ క్రమంలో కొత్తగూడెం సమీపంలోని ఓ కొండపై గుర్తు తెలియని మహిళను పెట్రోల్ పోసి దారుణంగా కాల్చి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైన మహిళ ఆధారాలు లభించకపోవడం… ఇదే సమయంలో నాగేంద్రమ్మ ఫ్యామిలీ మెంబర్స్ ఆమె కోసం గాలిస్తుండడంతో హత్యకు గురైంది ఆమెనని అనుమానించారు. కొండపై చనిపోయింది నాగేంద్రమ్మేనని భావించిన ఆమె కుటుంబ సభ్యులంతా కూడా కర్మకాండలు కూడా నిర్వహించారు. నాగేంద్రమ్మను కడసారి కూడా చూసుకోలేకపోయామన్న మనోవేదనతోనే ఆ కుటుంబం అంతా కూడా కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో ఆమె కుమారు యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం అయిన న్యూస్ చూస్తుండగా అందులో నాగేంద్రమ్మను గమనించి వారు ఉబ్బితబ్బిబయ్యారు. విజయవాడ నగరానికి చెందిన హెల్పింగ్ హైండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహాకుడు వెంకట్ యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారం చేసిన ఈ వీడియోను పలుమార్లు పరిశీలించిన కుటుంబ సభ్యులు చివరకు ఆమె నాగేంద్రమ్మేనని భావించారు. వెంటనే హెల్పింగ్ హైండ్స్ నిర్వహాకుడు వెంకట్ ను సంప్రదించడంతో నాగేంద్రమ్మ ఉన్న ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమం వివరాలను తెలుసుకున్నారు నాగేంద్రమ్మ కుటుంబ సభ్యులు. శుక్రవారం మధిర పట్టణంలోని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి చేరుకున్న ఆమె కుటుంబ సభ్యులు తమ తల్లి వివరాలను తెలియజేసి ఆమెను తమకు అప్పగించాలని అభ్యర్థించారు. స్థానిక పోలీసుల సమక్షంలో నాగేంద్రమ్మను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నామకరణం చేసి…

రెండేళ్ల క్రితం మధిర పట్టణంలోని బంజారా కాలనీలో మతిస్థిమితం లేక నాగేంద్రమ్మ తిరుగుతోంది. కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో అందరి ఇండ్లలోకి చొరబడుతుండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కాలనీ వాసులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆర్కే ఫౌండేషన్ అనాథాశ్రమం నిర్వహాకులు డాక్టర్ దోర్నాల రామకృష్ణ జ్యోతికి సమాచారం అందించి ఆమెను అక్కడకు తరలించారు. అయితే మతిస్థిమితం లేకుండా ఉన్న నాగేంద్రమ్మ తన పేరును కూడా చెప్పే పరిస్థితి లేకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు ఆమెను అక్కున చేర్చుకుని స్వర్ణ అని నామకరణం చేసి అప్పటి నుండి అదే పేరుతో పిలవడం ఆరంభించారు. రెండున్నర సంవత్సరాలుగా నాగేంద్రమ్మను కాపాడి ఆమెకు అన్ని తామై చూసుకున్న ఆర్కే ఫౌండేషన్ నిర్వాహకులకు ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ అవినాష్ కుమార్ నాగేంద్రమ్మ మిస్సింగ్ కు సంబంధించిన వివరాలను పరిశీలించి ఆమెను అప్పగించారు. రెండున్నరేళ్ల తరువాత తల్లి ఆచూకి దొరకబుచ్చుకుని ఆర్కేఫౌండేషన్ కు చేరుకున్న ఆమె కుటుంబ సభ్యుల గురించి నెట్టింట వైరల్ కావడంతో మధిర ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇంతకాలం అనాథగా భావించిన మతిస్థిమితం లేని వృద్దురాలికి కుటుంబం కూడా ఉందని తెలియడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆర్కే ఫౌండేషన్ నిర్వహాకులు ఆమెను తమ ఆశ్రమానికి తరలించడం వల్లే చనిపోయిందనుకున్న నాగేంద్రమ్మ కుటుంబ సభ్యుల ముందు సజీవంగా సాక్షాత్కరించడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

You cannot copy content of this page