కరపత్రాలతో సరికొత్త ప్రచారం…
ఆ అనుభవంతో అడ్వాన్స్ క్యాంపెయిన్..?
దిశ దశ, హుజురాబాద్:
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే వారి పేర్లు వినిపిస్తున్నాయి. అవకాశం వస్తే అందిపుచ్చుకుని ప్రజా క్షేత్రంలో తమ తల రాతలు ఎలా ఉన్నాయో పరీక్షించుకునే పనిలో పడ్డారు చాలా మంది. అయితే టికెట్ల వేటలో పోలీసు విభాగానికి చెందిన కొంతమంది అధికారులు కూడా గుట్టుగా పావులు కదుపుతుంటే ఆ పోలీసు అధికారి పేరు మాత్రం బాహాటంగానే చర్చ సాగుతోంది. తాజాగా ఆయన బరిలో నిలిస్తే కాళ్లు మొక్కయినా గెలిపించుకుంటానంటూ హుజురాబాద్ పౌరుడి పేరిట ముద్రించిన ఈ కరపత్రాలు హుజురాబాద్ ఏరియాలో పంపిణీ చేస్తున్నారు.
ఉప ఎన్నికల్లో తెరపైకి…
1996 బ్యాచ్ కు చెందిన పింగిళి ప్రశాంత్ రెడ్డి కమలాపూర్ మండలం శనిగరం గ్రామ వాసి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్సైగా, సీఐగా సేవలందించిన ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతం లూప్ లైన్ విభాగంలో పని చేస్తున్న ఆయన ఇటీవలే డీఎస్పీగా పదోన్నతి పొందారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన ప్రశాంత్ రెడ్డి అధికార పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించారు. అయితే అక్కడ నెలకొన్న సామాజిక వర్గ సమీకరణాలు, ఉద్యమ కారుల అంశం తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గమనించిన అధిష్టానం గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం కల్పించింది. దీంతో ప్రశాంత్ రెడ్డి మళ్లీ పోలీసు విభాగానికే పరిమితం కాగా తాజాగా సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన పేరు మళ్లీ తెరపైకి వస్తోంది. గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లా వాసులతో టచ్ లోకి రావడంతో పాటు వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ నుండి అవకాశం వస్తుందన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగుతోంది. తాజాగా ఆయనలోని సానుకూలతలను ఎకరవు పెడుతూ తయారు ముద్రించిన కరపత్రం హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. మూడు నాలుగు నెలల్లో ఎన్నికల జరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో మళ్లీ డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి పేరిట చర్చ సాగుతుండడం గమనార్హం. ఉప ఎన్నికల సమయంలో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ దాదాపు ఖరారు అయిన తరువాత పొలిటికల్ ఎంట్రీకి పింగిళి ఉవ్విళ్లూరడంతో టార్గెట్ చేరుకోలేకపోయారని… దీంతో లక్ష్యం చేరుకునేందుకు అడ్వాన్స్ క్యాంపెయిన్ మొదలు పెట్టినట్టుగా అర్థమవుతోంది. సగటు హుజురాబాద్ పౌరుడి పేరిట ముద్రించిన ఈ కరపత్రం ఆయనపై ఉన్న అభిమానంతో ముద్రించారా లేక డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందా అన్న చర్చ కూడా మొదలైంది.
పరిస్థితులు అంది పుచ్చుకునా..?
అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను గమనించే ముందస్తుగా ప్రశాంత్ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడి క్యాడర్ లో నెలకొన్న అయోమయ పరిస్థితులతో పాటు నాయకుల మధ్య ఏర్పడిన గ్యాప్, ఇంఛార్జిపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే ప్రశాంత్ రెడ్డి గురించి ప్రజల్లో సదాభిప్రాయం నెలకొనే విధంగా కరపత్రాలతో క్యాంపెయిన్ చేస్తున్నారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా సర్వీసులో ఉన్న డీఎస్పీ ప్రశాంత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సర్వం సన్నద్దంగా ఉన్నట్టుగా ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారం తేటతెల్లం చేస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వం విషయంలో అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే.