హంతకుడి కంట కన్నీరు…

తల్లిదండ్రుల కోసం తల్లడిల్లిన వైనం

వినడానికి విచిత్రంగానే ఉన్నా నూటికి నూరు శాతం ఈ ఘటన నాంపల్లి కోర్టులో సాక్షాత్కరించింది. కరుడు గట్టిన హంతకుడు కన్నీరు పెట్టిన సంఘటన సంచలనం కల్గించింది. హత్య చేసి యాక్సిడెంటల్ డెత్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి చివరకు చట్టానికి చిక్కిన ఆ నేరస్థుడు కోర్టులో కన్నీటి పర్యంతం అయ్యాడు. మర్డర్ చేసిన నాడు బాధితుని కుటుంబ సభ్యుల గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు మాత్రం తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే వారు లేరంటూ విలపించాడు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… 2019 జనవరి 31న జూబ్లీహిల్స్ లో పారిశ్రామికవేత్త చిగురుపాటి జైరాం హత్య చేసిన నిందితుడు దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విజయవాడ సమీపంలోని నందిగామ వద్ద కారులో వదిలేసి పరార్ అయ్యాడు. మెదట ప్రమాద మరణంగానే భావించినప్పటికీ జైరాం మృతదేహం నందిగామ సమీపంలో లభ్యం కావడం ఏంటన్న విషయంపై అనుమానించిన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీసి మర్డర్ గా నిర్దారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. అయితే దోషిగా శిక్ష ఖరారు చేసిన తరువాత రాకేష్ రెడ్డి కోర్టులో కంట తడిపెట్టాడు. నాలుగేళ్లుగా తాను జైల్లోనే ఉన్నానని తనకు శిక్ష తగ్గించాలని రాకేష్ రెడ్డి వేడుకున్నాడు. తన తండ్రి ఐసీయూలో ఉన్నాడని, తల్లి తీవ్ర అనారోగ్యంతో ఉందని కోర్టుకు విన్నవించాడు. వారిని బాగోగులు చూసుకునేందుకు ఎవరూ లేరని కన్నీటి పర్యంతం అయ్యాడు. జైరాంను హత్య చేసినప్పుడు ఏ మాత్రం కనికరం లేకుండా విచక్షణరహితంగా వ్యవహరించిన రాకేష్ రెడ్డి కోర్టులో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. మర్డర్ చేసినప్పుడు తాను చట్టానికి దొరికినట్టయితే శిక్ష తప్పదని అప్పుడు తన పేరెంట్స్ పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటే ఇంతదూరం వచ్చేదా అని అంటున్న వారూ లేకపోలేదు.

చట్టం… మానవత్వం…

చిగురుపాటి జైరాం హత్య తర్వాత రాకేష్ రెడ్డి రెండు విధాలుగా మానసిక వేదనకు గురయ్యే దుస్థితికి చేరుకున్నాడన్నది వాస్తవం. కనిపెంచిన తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే అవకాశం లేకపోగా, ఎన్ని నాటకాలు వేసినా చట్టానికి మాత్రం చిక్కక తప్పలేదు. హత్యకు పాల్పడే ముందే భవిష్యత్తును ఓ సారి ఆలోచించుకుంటే అటు జైరాం ప్రాణాలతో ఉండే వాడు కాగా ఇటు రాకేష్ రెడ్డి దర్జాగా తిరిగే వాడన్నది నిజం. ఏది ఏమైనా రాకేష్ రెడ్డి మాత్రం జీవిత కాలం శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి రాగా… ఇటు అవసాన దశకు చేరుకున్న తల్లిదండ్రులకు సేవలు చేసే అవకాశానికి దూరం కావడం గమనార్హం.

You cannot copy content of this page