హైకోర్ట్ ఆదేశాలతో కూల్చివేత…
నామమాత్ర చర్యలే: ఫిర్యాదు దారుడు
దిశ దశ, రాజన్న సిరిసిల్ల:
మునిసిపల్ వైస్ ఛైర్మన్ ఇంటిని బుల్డోజర్ కూల్చివేసింది. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హై కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు ఈ మేరకు చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయడంలో మునిసిపల్ కమిషనర్ విఫలం అయ్యారంటూ బాదితుడు ఆరోపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్ కు చెందిన బిల్డింగ్ సెల్లార్ ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గోపాల్ నగర్ లో వైస్ ఛైర్మన్ కు సంబంధించిన బిల్డింగ్ నిబందనలకు విరుద్దంగా నిర్మాణాలు చేశారని, కమర్షియల్ అవసరాలకు అనుగుణంగా నిర్మాణం జరిపారని, ప్రక్క ఇంటి గోడను ఆనుకుని టాయిలెట్ లు కట్టారని ఇంటి యజమానితో పాటు మరో స్థానికుడు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్ట్ ను ఆశ్రయించారు. హైకోర్ట్ అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు చేపట్టాలని, వాటిని తొలగించాలని ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు సెల్లార్ మెట్లను, షట్టర్లను తొలగించారు. ఈ విషయంపై ఇంచార్జ్ కమీషనర్ మిర్జా ఫసాహత్ అలీ బేగ్ మాట్లాడుతూ… హైకోర్ట్ ఆదేశాల మేరకు ఇంటి యజమానికి నోటీసులు ఇచ్చామని, అతని నుండి స్పందన రాకపోవడంతో కూల్చివేతలు చేపట్టామన్నారు. చట్ట ప్రకారం పార్కింగ్ కోసం సెల్లార్ ను పడగట్టామని వెల్లడించారు. మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలపై పిర్యాదు దారుడు నాగుల శ్రీనివాస్ స్పందిస్తూ… అధికారులు తూ… తూ… మంత్రంగా హై కోర్టు ఆదేశాలను అమలు చేశారని ఆరోపించారు. బిల్డింగ్ మెట్లు పార్కింగ్ స్థలంపై ఉన్న మెట్లు, రహదారిపై ఏర్పాటు చేసిన జనరేటర్, బిల్డింగ్ లో అక్రమంగా నిర్మించిన టాయిలెట్లను తొలగించలేదన్నారు. మరో ఇరవైనాలుగు గంటల్లోగా హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే మరోసారి పిటిషన్ వేసి కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని అభ్యర్థిస్తామని స్పష్టం చేశారు.