ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన వరదలు
భయం గుప్పిట దేశ రాజధాని
దిశ దశ, న్యూ ఢిల్లీ:
దేశ రాజధాని న్యూ ఢిల్లీ మీదుగా ప్రవహిస్తున్న యమునా నదిలో వరద ఉధృతి ఆందోళనకరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ వరద ఉధృతి తీవ్రంగా సాగుతుండడంతో పరివాహక ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నీటిని నదిలోకి విడుదల చేయడంతో గురువారం ఉదయం 7 గంటలకు యమునా నదిలో నీటిమట్టం 208.46 మీటర్లకు చేరుకుంది. ప్రమాదకర స్థాయింకంటే 3 మీటర్ల ఎత్తున వరద నీటిమట్టం కొనసాగుతోంది. గతంలో రికార్డులను పరిశీలిస్తే 1978లో ఈ నదిలో 207.49 మీటర్ల ఎత్తున నీటి ప్రవాహం సాగగా ఈ ఏడాది మాత్రం ఎవరి అంచనాలకు అందనంత రీతిలో వరద పోటెత్తడం గమనార్హం. హత్నికుండ్ బ్యారేజీ నీటిని దిగువకు విడుదల చేయడం నిలిపివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరద నీటి కారణంగా దిగువకు విడుదల చేయాల్సి వస్తోందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కారుకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. యమునా నదిలో వరద నీటి ప్రవాహం కారణంగా సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ మునిగిపోగా, మజ్నూ కాతిలా ఏరియాలోని కశ్మీరీ గేట్ ISBTతో కలిపే మార్గాన్ని మూసి వేశారు. ఈ ప్రాంతంలోనే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసం ఉండడంతో పాటు 500 మీటర్ల దూరంలో అసెంబ్లీ కూడా ఉన్నాయి. దీంతో వరద ఉధృతి మరింత తీవ్రతరం అయితే మాత్రం ఆయా ప్రాంతాలు కూడా వరద నీటిలో దిగ్భంధనం అయ్యే ప్రమాదం లేకపోలేదు. బుధవారం పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం 207 మీటర్లు దాటడంతో 2013 తరువాత ఈ ప్రాంతానికి ఇంతపెద్ద మొత్తంలో వరద నీరు వచ్చిచేరడం ఇదే మొదటి సారి అని అంటున్నారు.