దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ తో పాటు వివిధ ప్రాంతాల్లో గీతా భవన్ హోటల్స్ నిర్వహిస్తున్న సంస్థ యజమాని దివంగత రాజు శెట్టి భార్య వాసంతి (70) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. మానిసిక వేదనకు గురైన ఆమె భవనంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులకు సమాచారం అందించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివచారణ చేపట్టారు. పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి మాత్రం ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్తున్నారు. వాసంతి సోదరులు కూడా ఆత్మహత్య చేసుకుందని, పలు రకలా అనారోగ్య సమస్యలతో ఆమె సతమతమవుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గతంలో ఓ సారి…
అయితే రాజు శెట్టి మరణానంతరం గీతా భవన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ప్రాపర్టీ విషయంలో వివాదాలు కూడా నెలకొన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు మూడేళ్ల క్రితం వాసంతిపై గుర్తు తెలియని వ్యక్తులు తెల్ల వారు జామునే కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. అయితే ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మాత్రం లభ్యం కాలేదు. అప్పడు సీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అయినప్పటికీ ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం దొరకకపోవడం విస్మయం కల్గిస్తోంది. మరో వైపున వాసంతికి ఆమె కుటుంబ సభ్యులకు మధ్య వ్యాపారాల ద్వారా గడించిన ఆస్తుల విషయంలో విబేధాలు చోటు చేసుకుని ఉన్నాయన్న ప్రచారం బాహాటంగానే సాగుతోంది. చాలా కాలంగా తగాదాలు ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడిన సందర్భాలు లేవని స్థానికులు అంటున్నారు. ఒక్క సారి మాత్రం కత్తితో దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.