తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే
ఇసుక దోపిడిలో ఈటలకు వాటా ఉందా..?
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
దిశ దశ, హుజురాబాద్:
రాష్ట్రంలోనే కరీంనగర్ గడ్డకు ఓ ప్రత్యేకత ఉందని, తెలంగాణ సమాజం ఆకాంక్షల సాధన కోసం కోట్లాడే గడ్డ కరీంనగర్ గడ్డ అని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. హాత్ సే హత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం హజూరాబాదుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియా గాంధీకే దక్కుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జెఎసి పెడితే జెండాలు కట్టినం, దొర వస్తే దండాలు పెట్టినం, రాష్ట్ర అవతరణ ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చి తెలంగాణను సాధించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచినప్పటికీ కెసిఆర్ హామీలు నేటికి నెరవేరలేదన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బయ్యారంలో ఉక్కు కార్మాగారం ఏర్పాటు చేయాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని, గిరిజన యూనివర్సిటీ పెట్టాలని, నాలుగు వేల మెగా వాట్ల పవర్ ప్లాంట్లతో ఎన్టీపిసి అధ్వర్యంలో పెట్టాలని, ఐటిఐఆర్ కారిడార్ ఇవ్వాలని, సాగునీటి ప్రాజెక్టులను జాతీయ హోదా కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బిజెపి నాయకులు ఎవరూ తెలంగాణ కోసం ఉద్యమించలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుష్మాస్వరాజు ఒప్పించారన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యాత్ర ఫలితంగానే బిజెపి నాయకులు ఢిల్లీ నాయకులు పిలిపించారని ఆయన తెలిపారు. స్విస్ బ్యాంక్ లో వేల కోట్ల నల్లధనం ఉందని, బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేద వాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి తొమ్మిదేండ్లు గడిచిన 15 పైనలు కూడా చెయ్యలేదని దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోడి చెప్పిన మాటలు చేతల్లో ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెలంగాణలో ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడే వాడు కాదన్నారు. ఉద్యోగాల కోసం 21 కోట్ల దరఖాస్తులు వస్తే ఏడు లక్షల ఒక వెయ్యి ఆరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోడి చెప్పడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం తప్పా బిజెపి ప్రభుత్వం చేసిందేమి లేదనన్నారు. గత ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత కెసిఆర్ అవినీతిపై పోరాడుతామని చెప్పిన ఈటల రాజేందర్ గెలిచి సంవత్సరం గడిచినప్పటికీ ఎందుకు పోరాటం చెయ్యడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇసుక దోపిడి జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇసుక దోపిడిలో ఈటల రాజేందర్ వాటా ఉందా అని రేవంత్ నిలదీశారు. బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నాయన్నారు. కెసిఆర్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కొట్లాడినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బిఆర్ఎస్ నాయకులు గొప్పులు చెపుతున్నారని, వ్యవసాయ రంగానికి 24 ఉచిత విద్యుత్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఓట్లు అడగమని ప్రకటించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలనిన్నారు. ఇప్పటి వరకు హజూరాబాద్ లో బిజెపికి అవకాశం ఇచ్చారని ఒక్కసారి అవకాశం బల్మూరి వెంకట్ కు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.