నిజామాబాద్ జిల్లా సంజయ్ అభిమానికి చైన్ స్నాచింగ్ కు యత్నం
దిశ దశ, జగిత్యాల:
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై ఉన్న క్రేజీతో ఓ కార్యకర్త సెల్ఫీ దిగుతున్న క్రమంలో అగంతకుడు హస్తలాఘవం ప్రదర్శించాడు. దీంతో అలెర్ట్ అయిన సదరు కార్యకర్త అతన్ని వెంబడించడంతో సభకు హాజరైన వారు, పోలీసులు పట్టుకోవడంతో కథ సుఖాంతం అయింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున జగిత్యాలకు తరలివచ్చారు. ఈ సమావేశానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా హాజరయ్యారు. సభా ప్రాంగణంలో ఉన్న బండి సంజయ్ ని చూసిన ఓ కార్యకర్త సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం కనబర్చాడు. సెల్ఫీ దిగుతున్న క్రమంలోనే ఆయన మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడో అగంతకుడు. వెంటనే అప్రమత్తమైన ఆ కార్యకర్త అతన్ని వెంబడించడంతో బారిగేట్లు దూకుతున్న క్రమంలో పోలీసులు, సభకు హాజరైన వారు అగంతకున్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనలో అంగతకునికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధిత కార్యకర్త మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లాకు చెందిన తాను ప్రధాని మోడీ సభకు హజరయ్యేందుకు వచ్చానని వివరించారు. ఎంపీ బండి సంజయ్ ని గమనించి ఆయనతో సెల్ఫీ దిగుతున్న క్రమంలో అగంతకుడు చోరీకి విఫలయత్నం చేశాడన్నారు.