పోలీసులను విచారిస్తున్న పోలీసులు…

ఫోన్ ట్యాపింగ్ కేసు…

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నేరాల దర్యాప్తులో భాగంగా అనుమానితులను విచారించాల్సిన పోలీసులే అనుమానితులుగా మారిపోవడం సరికొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

అటు విచారణ… ఇటు సోదాలు…

శుక్రవారం సాయంత్రం నుండే కార్యరంగంలోకి దూకిన పోలీసు అధికారులు మొత్తం 9 మంది పోలీసు ఆఫీసర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం. వీరందరిని వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న పోలీసు అధికారులు మరో వైపున వారి ఇండ్లలో కూడా సోదాలు చేయడం గమనార్హం. ఇంటలీజెన్స్ ఐజీగా వ్యవహరించిన ప్రభాకర్ రావు సహా పలువురు అధికారుల ఇండ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి కొన్ని ఆధారాలను సేకరించినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.

టాప్ సీక్రెట్ ఇంఛార్జి…

స్పెషల్ ఇంటలీజెన్స్ బ్రాంచ్ లో టాప్ సీక్రెట్ వింగ్ ఇంఛార్జిగా వ్యవహరించిన డీఎస్పీ భుజంగరావును శుక్రవారం రాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్ హౌజ్ నుండి ప్రత్యేక పోలీసు బృందం తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్) గా బదిలీపై వచ్చారు. ఎస్ఐబీలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం కూడా ఉన్నట్టుగా గుర్తించిన దర్యాప్తు బృందం వివిధ కోణాల్లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. మొత్తం 9 మంది పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అరెస్ట్ చేస్తారా..?

ప్రధానంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అతలాకుతలం చేస్తోంది మరో ప్రశ్న వేధిస్తోంది. వీరందరిని అత్యంత రహస్యంగా హైదరాబాద్ తరలించిన దర్యాప్తు బృందం ఫ్రణిత్ రావు ఛాటింగ్ ఆధారంగా విచారిస్తోంది. అయితే వీరికి కూడా అరెస్ట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ కేసులో వీరందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలే మెండుగా ఉన్నాయని తెలుస్తోంది. ఆయా అధికారుల ఇండ్లలో సోదాలు కూడా చేయడానికి ఇదే కారణమని అంటున్నారు. అయితే విచారణకు హాజరైన పోలీసు అధికారుల్లో ఎంతమంది ప్రమేయం ఉంది అన్న విషయంపై మాత్రం బయటకు పొక్కడం లేదు. దర్యాప్తు అధికారులు అదికారికంగా చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు.

You cannot copy content of this page