అప్పుడలా… ఇప్పుడిలా… పదేళ్లుగా…

దిశ దశ, భూపాలపల్లి:

పదేళ్లుగా ఆ ప్రాజెక్టు చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ప్రాజెక్టు కేంద్రీకృతంగానే సమీకరణాలు నెరుపుతున్నారు. అధికార పక్షానికి ఆ ప్రాజెక్టు కలిసి వచ్చినట్టుగా మారింది. అద్భుతమైదంటూ అప్పటి అధికార పక్షం కీర్తించుకుంటే… అధ్వాన్నమైందని నేటి ప్రభుత్వం ఢంకా బజాయిస్తోంది. దాదాపు పదేళ్లుగా ఈ ప్రాజెక్టు చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి.

కాళేశ్వరం…

2015లో శంకుస్థాపన జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపైనే ఆరోపణలు, విమర్శలు సాగుతున్నాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిర్మించింది. తుమ్మడిహడ్డి నుండి ఎల్లంపల్లి వరకు గ్రావిటీ ద్వారా నీరు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కాళేశ్వరం నిర్మాణం చేశారంటు విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టుల్లో అత్యంత ముఖ్యమైనది ఈ ప్రాజెక్టు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ కు ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగపడింది. మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డితో పాటు ఉత్తర తెలంగాణా జిల్లాలకు చెందిన రైతాంగం, పార్టీ క్యాడర్ ఈ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించింది. తుది దశకు చేరుకున్న మేడిగడ్డ బ్యారేజీ పూర్తయితే తెలంగాణ అంతా కూడా సస్య శామలం అవుతుందని గులాభి పార్టీ నాయకత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. జాతరను మరిపించేలా కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం నిర్వహించారు 2018 ఎన్నికలకు ముందు. ఈ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కాదని వేరే పార్టీ వైపు మొగ్గు చూపితే ఈ ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోతుందన్న ప్రచారం కూడా జరిగింది. దీంతో ముందస్తు ఎన్నికలకు వెల్లి కేసీఆర్ సర్కార్ రెండో సారి అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించింది కాళేశ్వరం. 2019లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తెలంగాణ అంతటికి తరలించడంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు చాలా ప్రాంతాల్లో పంటలు సస్యశామలం అయ్యాయని కూడా 2023 ఎన్నిల నాటి వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది.

ఇప్పుడిలా…

అయితే తెలంగాణ మాగాణానికి నీరందించే ఈ ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ 2023 అక్టోబర్ 21న కుంగుబాటుకు గురైంది. 7వ బ్లాకులోని పిల్లర్లు హఠాత్తుగా కుంగిపోవడంతో బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే మేడిగడ్డకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాటారం మండల కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్ షో నిర్వహించారు. అయితే అప్పటి మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా రాహులు గాంధీకి సెటైరికల్ కామెంట్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. కాటారం వరకు వెల్లిన రాహుల్ గాంధీ అక్కడికి కొద్ది దూరంలోనే ఉన్న మేడిగడ్డను కూడా చూసినట్టయితే బావుండేదన్న రీతలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ టూర్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంతో రాహుల్ గాంధీ డైరక్ట్ అక్కడకు చేరుకుని నిర్మాణ లోపాలపై విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ అంశాన్ని లేవనెత్తగా, మార్పు కోరుకున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించడం, పలువురు క్యాబినెట్ మంత్రులు మేడిగడ్డ వద్ద వైఫల్యాలను ఎత్తిచూపడం జరిగిపోయాయి. ఆ తరువాత విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నివేదికల నేపథ్యంలో ఈఎన్సీలు మురళీ ధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లుపై వేటు వేశారు. తాజాగా మంగళవారం మరోసారి ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు సందర్శించబోతున్నారు. మేడిగడ్డ నిర్మాణంలో జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సారి క్షేత్ర స్థాయి పర్యటనకు నడుం బిగించింది. అప్పుడు కాళేశ్వరం నిర్మాణం గొప్పతనమంటూ ప్రచారం చేసుకుంటే ఇప్పుడు దాని వైఫల్యాలను ఎత్తి చూపేందుకు వేదికగా మారింది ఈ ప్రాజెక్టు.

You cannot copy content of this page